ఎమ్మెల్యేను అడ్డుకున్నారని రైతులను చితకబాదిన్రు

ఎమ్మెల్యేను అడ్డుకున్నారని రైతులను చితకబాదిన్రు
  • మబ్బుల 3 గంటలకు పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లి టార్చర్
  • ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ చేయించారన్న జేఏసీ
  • తాగి గొడవచేసినందుకే అరెస్ట్ చేశామన్న పోలీసులు   
  • హనుమకొండ జిల్లా ఐనవోలులో ఘటన  

హనుమకొండ, వెలుగు: ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేను అడ్డుకున్న రైతులపై పోలీసులు ప్రతాపం చూపించారు. ఆందోళనలో పాల్గొన్న ముగ్గురు రైతులను తెల్లవారుజామున స్టేషన్​కు తీసుకెళ్లి చితకబాదారు. దీంతో బాధిత రైతులు గాయాలపాలై ఇంటికి చేరారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మధ్యాహ్నం వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ను హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెం గ్రామానికి చెందిన రైతులు అడ్డుకున్నారు. కారుకు అడ్డంగా దుంగలు వేసి ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లిపోయేలా చేశారు. ఈ సందర్భంగా ఐనవోలు ఏఎస్సై సత్యనారాయణ, కానిస్టేబుల్స్, రైతులకు మధ్య తోపులాట జరిగింది. నిరసన వల్ల ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత బుధవారం తెల్లవారుజామున పెరుమాండ్లగూడెంకు చెందిన కలపగిరి శ్రీనివాస్, నిరంజన్, మురళి అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. మరో 9 మందిపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్లిన వారిని స్టేషన్ లో ఉంచి చిత్రహింసలు పెట్టి లాఠీలతో తీవ్రంగా కొట్టారు. నిరంజన్, మురళికి కాళ్ల భాగంలో గాయాలయ్యాయి. తమను స్టేషన్ లో పెట్టి ఐనవోలు ఎస్సై భరత్ కుమార్, తన సిబ్బంది బూతులు తిడుతూ ఇష్టారీతిన కొట్టారని బాధితులు చెప్తున్నారు. అయితే, గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు వారిని విడుదల చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ల్యాండ్ పూలింగ్ విషయంలో ఆందోళన చేపట్టినందుకే రైతులను ఎమ్మెల్యే రమేశ్ కావాలనే పోలీసులతో కొట్టించారని ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు జేఏసీ నేతలు మండిపడుతున్నారు.  

తాగి గొడవ చేసినందుకే కేసులు 

కొంతమంది ప్రభుత్వ కార్యక్రమాన్ని చెడగొట్టేలా గొడవ చేశారని మామునూరు ఏసీపీ నరేశ్, పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్ చెప్పారు. డ్యూటీలో ఉన్న ఏఎస్సైని, కానిస్టేబుళ్లను మద్యం మత్తులో నెట్టివేశారని ఏఎస్సై కె. సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో  కేసు పెట్టామని,  ముగ్గురిని అరెస్ట్ చేశామే తప్ప చితకబాదలేదన్నారు.

కొడ్తూ వీడియో తీసి సీఐకి పంపిన్రు  

ల్యాండ్ పూలింగ్ విషయంలో ఆందోళన చేసినందుకు మమ్ములను అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుని పోయిన్రు.  మా కొడుకు నిరంజన్, బావమరిది మురళి ఇద్దరినీ కొట్టిన్రు. ఇద్దరినీ కొట్టుకుంటూ ఎస్సై వీడియోలు తీసి సీఐకి పంపిండు. సీఐ ఇష్టమొచ్చిన బూతులు తిట్టిండు. ఎన్ని తిడుతున్నా చేసేదేమీ లేక సైలెంట్​గా ఉండాల్సి వచ్చింది. 
- కలపగిరి శ్రీనివాస్, బాధితుడు