సీఎం వస్తుండని అంబులెన్స్‌‌నూ పోనీయలే..

సీఎం వస్తుండని అంబులెన్స్‌‌నూ పోనీయలే..
  • 30 నిమిషాలు ట్రాఫిక్‌‌లోనే ఆపేసిన పోలీసులు
  • బిడ్డకు ఎమర్జెన్సీ ఉందని తల్లి చెప్పినా పట్టించుకోలే

సంగారెడ్డి, వెలుగు: సీఎం వస్తున్నారన్న కారణంతో ఎమర్జెన్సీగా వెళ్తున్న అంబులెన్స్ కు పోలీసులు దారి ఇయ్యలేదు. దాదాపు అరగంట పాటు ఆపేశారు. తన బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉందని తల్లి వేడుకున్నా పట్టించుకోలేదు. దీంతో వాహనదారులు, పోలీసుల మధ్య గొడవ జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో గురువారం చోటుచేసుకుందీ ఘటన. కొల్లూరు పర్యటన ముగించుకొని పటాన్ చెరుకు సీఎం రోడ్డుమార్గం ద్వారా బయల్దేరగా.. 65వ నేషనల్ హైవేపై పటాన్ చెరు మార్కెట్ వద్ద పోలీసులు ట్రాఫిక్‌‌‌‌ను ఆపేసి రోడ్డును బ్లాక్ చేశారు. ఈ క్రమంలో సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది. 

అంబులెన్స్ కు కూడా దారి ఇవ్వకపోవడంతో జనం గొడవకు దిగారు. దాదాపు 30 నిమిషాల పాటు అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో తన బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉందని ఓ తల్లి ప్రాధేయపడినా పోలీసులు వినలేదు. కాళ్ల మీద పడినా పోలీసులు కనికరించలేదు. దీంతో కోపోద్రిక్తులైన వాహదారులు రోడ్డుకు అడ్డుపెట్టిన బారికేడ్లను బలవంతంగా తోసేశారు. కొంతసేపు పోలీసులు, వాహనదారుల మధ్య తోపులాట జరిగింది. తర్వాత అంబులెన్స్ కు దారి ఇప్పించి పంపించారు.