ప్రజావాణికి వచ్చిన దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లిన పోలీసులు: జగిత్యాల కలెక్టరేట్‌‌లో ఘటన

ప్రజావాణికి వచ్చిన దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లిన పోలీసులు: జగిత్యాల కలెక్టరేట్‌‌లో ఘటన

జగిత్యాలటౌన్, వెలుగు: ప్రజావాణిలో ఆఫీసర్లను కలిసి తన గోడును చెప్పుకునేందుకు వచ్చిన ఓ దివ్యాంగుడిని పోలీసులు, ఇతర సిబ్బంది వీల్‌‌చైర్‌‌తో సహా బయటకు లాక్కెళ్లారు. ఈ ఘటన జగిత్యాల కలెక్టరేట్‌‌లో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన రాజగంగారం దివ్యాంగుడు. తాను ఇంటికి వెళ్లే దారిలో రోడ్డుకు అడ్డంగా కొందరు గోడ నిర్మించడం వల్ల తనకు నల్లా కనెక్షన్‌‌ ఇవ్వడం లేదని ఇటీవల అడిషనల్‌‌ కలెక్టర్‌‌కు ఫిర్యాదు చేశాడు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రాజా గంగారాం సోమవారం కలెక్టరేట్‌‌లో ప్రజావాణికి వచ్చాడు. అడిషనల్‌‌ కలెక్టర్‌‌ లతను కలిసి తన సమస్యను విన్నవించగా.. సంబంధిత ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.

అయితే తాను ఎంత తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని, కలెక్టర్‌‌ వచ్చే వరకు ఇక్కడే ఉంటానని రాజాగంగారం నిరసన తెలిపేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న కానిస్టేబుల్, ఇతర సిబ్బంది కలిసి రాజాగంగారాంను వీల్‌‌చైర్‌‌తో సహా బయటకు ఈడ్చుకెళ్లారు. ఆఫీసర్ల తీరును నిరసిస్తూ అతడు డోర్‌‌ ఎదుట కింద పడుకొని నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌ మెట్‌‌పల్లి ఆర్డీవోకు ఫోన్‌‌ చేసి మాట్లాడారు. మంగళవారం ఉదయం ముత్యంపేటకు వెళ్లి వివరాలు తెలుసుకొని, బాధితుడికి న్యాయం జరిగేలా చూడాలని ఆర్డీవోను ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

కానిస్టేబుల్‌‌కు షోకాజ్‌‌ నోటీస్‌‌ ఇచ్చాం: కలెక్టర్‌‌ సత్యప్రసాద్‌‌
ప్రజావాణికి వచ్చే వృద్ధులు, దివ్యాంగుల విషయంలో మానవీయ కోణంలో స్పందిస్తున్నామని కలెక్టర్‌‌ సత్యప్రసాద్‌‌ చెప్పారు. ‘రాజాగంగారం సమస్యను పరిష్కరిస్తామని అతడికి చెప్పాం, అయినా వినకుండా తన సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుంచి కదలనని సుమారు 30 నిమిషాల పాటు నేలపైనే కూర్చున్నాడు. ఆఫీసర్లు ఎంత చెప్పినా వినకపోవడంతో పక్కనే ఉన్న వెయిటింగ్‌‌ హాల్‌‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా.. ఓ కానిస్టేబుల్‌‌ దురుసుగా ప్రవర్తించాడు’ అని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపి సదరు కానిస్టేబుల్‌‌కు షోకాజ్‌‌ నోటీసు జారీ చేశామన్నారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చామని కలెక్టర్‌‌ వివరించారు.