కేరళ స్టూడెంట్​ మృతికి ర్యాగింగే కారణం: పోలీసులు

కేరళ స్టూడెంట్​ మృతికి ర్యాగింగే కారణం: పోలీసులు

తిరువనంతపురం: జూనియర్ స్టూడెంట్​ను సీనియర్లు టార్చర్ చేశారు. బెల్టులతో కొట్టారు. పిడిగుద్దులు కురిపించారు. అలా దాదాపు 20 మంది కలిసి ఒకరోజుకుపైగా 29 గంటల పాటు నిరంతరంగా జూనియర్​పై దాడి చేశారు. దీంతో మనస్థాపం చెందిన బాధితుడు హాస్టల్​లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వయనాడ్​లోని వెటర్నరీ కాలేజీ సెకండియర్ స్టూడెంట్ జేఎస్ సిద్ధార్థన్ ఆత్మహత్య కేసులో.. కేరళ పోలీసులు సీబీఐ అధికారులకు సమర్పించిన రిపోర్టులోని విషయాలివి.

కేసు దర్యాప్తు సీబీఐకి.. 

సెకండియర్ చదువుతున్న సిద్ధార్థన్ ఫిబ్రవరి 28న హాస్టల్ బాత్రూమ్​లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై అతడి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసుపై రాజకీయ దుమారం రేగడంతో మార్చి 9న కేరళ సీఎం విజయన్ సీబీఐతో దర్యాప్తునకు హామీ ఇచ్చారు. ఇది జరిగాక కూడా కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాష్ట్ర పోలీసులు సీబీఐకి అందజేయలేదని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఆరోపించడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో ఎస్​ఎఫ్​ఐ విభాగం కార్యకర్తలతో సహా 20 మందిపై పోలీసులు కేసు పెట్టారు. 

ఆపై వివరాలను సీబీఐ అధికారులకు శుక్రవారం అందజేశారు. పోలీసుల నివేదికలోని అంశాలు ఆదివారం బయటపడ్డాయి. ‘‘ఫిబ్రవరి 16న ఉదయం 9 గంటల నుంచి మొదలు పెట్టి ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 2 గంటల వరకు సిద్ధార్థన్​పై 20 మంది విద్యార్థులు, సీనియర్లు కంటిన్యూయస్​గా దాడికి పాల్పడ్డారు. 

దీంతో తన చదువు కొనసాగించలేనని, అలాగని మధ్యలో వదిలేసి ఇంటికి పోలేనని మనస్థాపం చెందిన సిద్ధార్థన్.. హాస్టల్ బాత్రూమ్​లో ఉరేసుకుని చనిపోయాడు”అని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్​కు ఫోరెన్సిక్​ బృందంతో కూడిన సీబీఐ టీమ్ త్వరలోనే వయనాడ్​కు రానుంది.