నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

మంచిర్యాల/ షాద్నగర్, వెలుగు : రాష్ట్రంలోని వివిధ చోట్ల పోలీసులు దాడులు చేసి నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు.  మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల వ్యాపారుల మీద దాడులు చేసి, రూ.41లక్షల విత్తనాలను పట్టుకున్నట్టు రామగుండం పోలీస్ కమిషనర్​ వి.సత్యనారాయణ తెలిపారు. ఎనిమిది మందిని అరెస్టు చేయగా,  మరో ఆరుగురు పరారయ్యారని చెప్పారు.  బుధవారం మంచిర్యాలలో ని ఎం కన్వెన్షన్​ హాల్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.  బీటీ2 కవర్లలో నకిలీ విత్తనాలు  ప్యాక్​ చేసి రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. టాస్క్​ఫోర్స్ సీఐలు కిరణ్​, రాజ్​కుమార్​ల ఆధ్వర్యంలో నాలుగు టీంలు ఏకకాలంలో తనిఖీలు చేసి, నాలుగు ముఠాలను పట్టుకున్నట్టు చెప్పారు. మాదారం పోలీస్​స్టేషన్​ పరిధిలో ఆసిఫాబాద్​ మండలం బూరుగూడకు చెందిన లొకండి స్వామి, లొకండి భిక్షపతిల దగ్గర 7.10 క్వింటాళ్ల విత్తనాలను పట్టుకుని,   వెయ్యి ఖాళీ ప్యాకింగ్​ కవర్లు, ప్యాకింగ్​ మిషన్​, బైక్​లను స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా భీమవరానికి చెందిన గోరంట్ల సురేష్​బాబు పరారీలో ఉన్నాడన్నారు.

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పారుపల్లి రాజు, ఈదునూరి సదానందం, ఆసిఫాబాద్​ జిల్లా కౌటాల మండలం చింతగూడకు చెందిన భూక్యా విఘ్నేష్​లను అరెస్టు చేసి 1.80 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.  తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రేపల్లెవాడకు చెందిన బోయపాటి అనిల్​​కుమార్,  దాసరి సురేందర్​ల దగ్గర 1.50 క్వింటాళ్ల విత్తనాలు పట్టుకున్నట్లు తెలిపారు. కర్నూల్​కు చెందిన హనుమతప్ప, రేపల్లెవాడకు చెందిన దాసరి ఎలమంద పరారీలో ఉన్నారన్నారు.   నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో మంచిర్యాలకు చెందిన అప్పని ప్రదీప్​, భీమారానికి చెందిన బోగె విశాల్​, వేమనపల్లి మండలం కొత్తపల్లికి చెందిన ఇస్తారిలను అరెస్టు చేశామని సీపీ తెలిపారు. కర్నూల్​ జిల్లా గోనెగండ్లకు చెందిన పాండురంగారెడ్డి, లక్ష్మీనారాయణ పరారీలో ఉన్నారన్నారు. వీరిదగ్గర 3.80 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్టు చెప్పారు. కాగజ్​నగర్​ మండలం బాబాసాగర్​లో  రూ.62 విలువైన  గ్లైసిల్​ నకిలీ పత్తి విత్తనాలను పట్టుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు చింతలమానపల్లి ఎస్సై రామ్మోహన్​ తెలిపారు. ఎలుముల రమేష్​, ఎలుముల కమలాకర్​  నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నట్టు సమాచారం రాగా దాడి చేశారు. వారి వద్ద 62 ప్యాకెట్లను  స్వాధీనం చేసుకున్నారు.

సైబరాబాద్ ఎస్ వోటి పోలీసుల  దాడులు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని రతన్ కాలనీలో నకిలీ పత్తి విత్తనాలను అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, ఎస్సై రాజేశ్వర్ రెడ్డిల ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. షాద్ నగర్ కు చెందిన పిప్పళ్ళ శ్రీనివాస్ యాదవ్,  షాబాద్ మండలం సీతారాంపురంకు చెందిన కుందాల సిద్దేశ్వర్ లను అదుపులోకి తీసుకున్నారు. రూ. 4లక్షల విలువైన399 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్ లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ  విత్తనాల విక్రయాలతో సంబంధం ఉన్న నలుగురు పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. మరికొందరికి ఈ వ్యాపారంతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి

బతికుండగానే.. తల్లికి నిప్పంటించాడు