హనుమకొండ జిల్లాలోని యూనియన్ బ్యాంక్ గోల్డ్ లోన్ స్కామ్‎పై కదులుతున్న డొంక..!

హనుమకొండ జిల్లాలోని యూనియన్ బ్యాంక్ గోల్డ్ లోన్ స్కామ్‎పై కదులుతున్న డొంక..!

ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని యూనియన్ బ్యాంక్‎లో వెలుగు చూసిన గోల్డ్ లోన్ స్కామ్‎లో డొంక కదులుతోంది. బ్యాంక్ మేనేజర్ ఫేక్ డాక్యుమెంట్లతో రూ.74 లక్షల గోల్డ్ లోన్ తీసుకున్నట్లు తేలడంతో ధర్మసాగర్ పీఎస్‎లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ స్కామ్‎పై విచారణ జరుగుతుండగానే గతంలో ఇక్కడ పని చేసిన మరో మేనేజర్ వ్యవహారంపై కూడా బ్యాంక్ ఆఫీసర్లు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. 

గతంలో పని చేసిన ఒక మేనేజర్ ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని ఒక కొందరు దళారులతో, ఒక మీసేవ నిర్వహకుడితో కలిసి చిన్న పరిశ్రమలకు, షాపులకు ముద్రా లోన్లు ఇప్పించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. షాప్స్ లేకున్నా ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించడమే కాకుండా పంచాయతీ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి భారీగా ముద్రా లోన్లు ఇప్పించి కమీషన్లు తీసుకున్నట్టు తెలిసింది.

లోన్లు తీసుకున్న వారికి తెలియకుండా మళ్లీ లక్షల్లో లోన్లు తీసుకుని కట్టకపోవడంతో కస్టమర్లకు బ్యాంక్ నుంచి ఫోన్ రావడంతో అసలు విషయం బయటపడింది. సదరు కస్టమర్లకు తెలియడంతో లోన్ తీసుకున్నది నకిలీ పత్రాలతోనే కావడంతో బయటపెట్టకుండా సదరు మేనేజర్‎కు కాల్ చేసి సెటిల్ చేసుకున్నారు. 

మండల కేంద్రంలోని ఒక  మీసేవ నిర్వాహకుడికి ఏకంగా మేనేజర్ లాగిన్, పాస్ వర్డ్‎లు ఇవ్వడం గమనార్హం. ఆ మీసేవ నిర్వాహకుడు తన షాపులో పనిచేసే వారి పేర్లపై, మరికొందరి పేర్లపై నకిలీ పత్రాలతో లక్షల్లో లోన్లు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో బ్యాంక్ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.