ఇరాన్​లో పోలీసుల దుశ్చర్య

ఇరాన్​లో పోలీసుల దుశ్చర్య

హిజాబ్​ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న చెఫ్ ను చిత్రహింసలు పెట్టి చంపేసిన రివల్యూషనరీ గార్డ్ దళాలు

టెహ్రాన్: ఇరాన్​లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న సెలబ్రిటీ చెఫ్​ మెహర్షాద్ షాహిదీ(19) అలియాస్ జామీ ఆలివర్​ను పోలీసులు కొట్టి చంపేశారు. ఆదివారం రోజు నిరసన సమయంలో షాహిదీని రివల్యూషనరీ గార్డ్ దళాలు కొడుతుండగా తాము చూశామని ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు. పోలీసులు మాత్రం తమకేమీ సంబంధంలేదంటున్నారు.

షాహిదీ అంత్యక్రియలకు వేలాదిమంది అభిమానులు, హిజాబ్ ఆందోళనకారులు హాజరయ్యారు. నిరసన జరుగుతుండగా షాహిదీని పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఆపై కస్టడీలో చితకబాదటంతో తలకు బలమైన గాయాలై షాహిదీ చనిపోయాడని తెలిపింది. అతడు గుండెపోటుతో చనిపోయాడని షాహిదీ తల్లిదండ్రులతో పోలీసులే బలవంతంగా చెప్పించారని ఆరోపించింది.

కాగా, షాహిదీ తల, చేతులు, కాళ్లపై ఎలాంటి గాయాలులేవని ఇరాన్ చీఫ్ జస్టిస్ మౌసావి తెలిపారు. సోషల్ మీడియాలో మాత్రం ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అతని బర్త్​డేకు ముందురోజే పోలీసులు దారుణంగా చంపేశారని, ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించేదిలేదని ప్రముఖులు ట్వీట్ చేశారు. ఇప్పటివరకు పోలీసుల కాల్పులు, దాడుల్లో 250 మందికి పైగా హిజాబ్​ ఆందోళనకారులు చనిపోయారు.