కరీంనగర్​లో జాగరణ దీక్షపై పోలీసుల ఓవరాక్షన్

కరీంనగర్​లో జాగరణ దీక్షపై పోలీసుల ఓవరాక్షన్
  • 317 జీవో సవరణ కోసం 
  • ఎంపీ ఆఫీసులో దీక్షకు దిగిన సంజయ్​
  • భారీగా మోహరించిన పోలీసులు.. 
  • బీజేపీ లీడర్లపై, జర్నలిస్టులపై దాడి
  • కొవిడ్​ రూల్స్​ పాటిస్తూ ఆఫీసులో 
  • దీక్ష చేస్తే అరెస్టులా?: బీజేపీ స్టేట్​ చీఫ్
  • పోలీసుల తీరును ఖండించిన తరుణ్​ చుగ్​, వివేక్​ వెంకటస్వామి, ఈటల, రఘునందన్​

కరీంనగర్, వెలుగు: జీవో 317లో మార్పులు చేసి  ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలనే డిమాండ్​తో బీజేపీ స్టేట్​ చీఫ్, ఎంపీ​ బండి సంజయ్​ ఆదివారం రాత్రి​ కరీంనగర్​లో చేపట్టిన జాగరణ దీక్షపై పోలీసులు ఓవరాక్షన్​ చూపించారు. ఆయన దీక్షకు దిగిన ఎంపీ ఆఫీసులోకి పోలీసులు వాటర్​ పంపింగ్​చేసి, డోర్లు పగులగొట్టి, గ్రిల్స్​ను గ్యాస్​కట్టర్​తో ఊడగొట్టి లోపలికి ప్రవేశించారు. దొరికినవాళ్లను దొరికినట్టు అరెస్ట్​ చేశారు. బండి సంజయ్​ను ఆఫీసులో నుంచి బలవంతంగా బయటకు ఎత్తుకొచ్చి అరెస్టు చేశారు. పోలీసుల దాడిలో బీజేపీ లీడర్లతో పాటు పలువురు మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. రాత్రంతా కరీంనగర్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం, పోలీసుల తీరుపై బండి సంజయ్​ మండిపడ్డారు.      
దీక్ష శిబిరానికి వందలాదిగా పోలీసులు
ఎంపీ క్యాంపు ఆఫీస్​ వద్ద ఆదివారం రాత్రి 7.30 గంటలకు దీక్షకు దిగుతానని బండి సంజయ్​ ప్రకటించడంతో సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో వందలాది పోలీసులు గంట ముందే అక్కడికి చేరుకున్నారు. ఎంపీ క్యాంప్​ ఆఫీస్​లోని బీజేపీ నేతలు, కార్యకర్తలను బయటకు పంపించే ప్రయత్నం చేశారు. నల్గొండ జిల్లాలో వేలాది బైకులతో ర్యాలీ, సభ నిర్వహించిన కేటీఆర్​కు లేని ఆబ్జెక్షన్స్​ తమ విషయంలో మాత్రమే ఎందుకని, ఆఫీసులో దీక్ష చేస్తుంటే ఇబ్బందేందని బీజేపీ కార్యకర్తలు పోలీసులను ప్రశ్నించారు. జాగరణను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బీజేపీ రాష్ట్ర ఉఫాధ్యక్షులు డాక్టర్ జి. మనోహర్ రెడ్డి హెచ్చరించారు. కరోనా రూల్స్​ పాటిస్తూ  ఆఫీసులో జాగరణ చేస్తే అడ్డుకోవడం అన్యాయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. పోలీసుల తీరుపై బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు బొడిగె శోభ, రావు పద్మ, జె.సంగప్ప, దరువు ఎల్లన్న, టి.వీరేందర్ గౌడ్, ఎన్వీ సుభాష్, బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్యకర్తలను పోలీసులు కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్​కు తరలించారు. పోలీసుల దాడితో పలువురు కార్యకర్తలు, జర్నలిస్టులు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. పోలీసుల దెబ్బలకు ఓబీసీ  మోర్చా నాయకుడు మంథెన కిరణ్ కాలు విరిగింది. 
పోలీసుల వలయాన్ని ఛేదించుకొని..!
జగిత్యాల జిల్లా పర్యటన నుంచి కరీంనగర్​కు వచ్చిన బండి సంజయ్​ సిటీలోనే కారు దిగి, బైకుపై ఆఫీసుకు చేరుకున్నారు. ఒక వ్యూహం ప్రకారం కార్యకర్తలు, లీడర్లు పోలీసులను దారి మళ్లించారు. సరిగ్గా అదే సమయంలో పోలీసుల వలయాన్ని ఛేదించుకున్న సంజయ్​ తన క్యాంపు ఆఫీస్​లోకి వెళ్లారు. అప్పుడే గ్రిల్స్  సమీపానికి వచ్చి సంజయ్ మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పలువురు మీడియా ప్రతినిధులను పోలీసులు కొడుతూ బయటికి ఈడ్చుకెళ్లారు. మైకుల్ని, కెమెరాలను గుంజుకుంటూ లాక్కెళ్లారు.   
గ్యాస్​కట్టర్​తో గ్రిల్స్​ కట్​చేసిన పోలీసులు
ఎంపీ ఆఫీసులో దీక్ష చేస్తున్న సంజయ్​ను అరెస్టు చేసేందుకు కరీంనగర్​ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ కూడా అక్కడికి వచ్చారు. కార్యకర్తలు వలయంగా ఏర్పడి పోలీసులను లోపలికి రానీయలేదు. ఆఫీస్​లో ఉన్న కార్యకర్తలు, నాయకులపైకి పోలీసులు నీటిని చల్లారు. రాడ్లు, గ్యాస్ కట్టర్ తో గేటును, గ్రిల్స్​ను, తలుపులను కట్ చేసి లోపలికి వెళ్లారు. ప్రతిఘటించిన బీజేపీ కార్యకర్తలను ఈడ్చేసి..సంజయ్​ను అదుపులోకి తీసుకున్నారు. మానకొండూరు పోలీస్​ స్టేషన్​కు తరలించారు.  పోలీస్​ స్టేషన్​లోనే సంజయ్​ దీక్ష కొనసాగించారు.
రాష్ట్రంలో రాక్షస  పాలన: సంజయ్​
రాష్ట్రంలో రాక్షస, కుటుంబపాలన నడుస్తోందని సంజయ్​ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. ‘‘ఏ ఉద్యోగిని కదిలించినా కన్నీళ్లే. చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతున్నామని ఉద్యోగులు ఏడుస్తున్నరు. నిన్నగాక మొన్న తెచ్చిన 317 జీవో వల్ల మహబూబాబాద్ జిల్లా హెడ్మాస్టర్ బానోతు జేతురామ్​నాయక్​ గుండెపోటుతో చనిపోయారు. అయినా సీఎం రాతి గుండె కరగడం లేదు” అని ఆయన మండిపడ్డారు.  ‘‘జాగరణ దీక్షతో బీజేపీ సత్తా ఏందో చూపించినం. కరోనా రూల్స్​పాటిస్తూ ప్రశాంతంగా జాగరణ చేసే బీజేపీ కార్యకర్తలు, ఉద్యోగులపై దాడులు చేస్తారా? కార్యక్రమం కవరేజీకి వచ్చిన జర్నలిస్టులపై దాడుల చేస్తారా?” అంటూ పోలీసులు, ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘కేసీఆర్​..! కొవిడ్​ రూల్స్​పాటించకుండా నల్గొండలో నీ కొడుకు కేటీఆర్​ వేలాది మందితో ర్యాలీ తీస్తే పట్టదా? అక్కడ ర్యాలీ తీసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై ఎందుకు లాఠీచార్జీ చేయలేదు? దమ్ముంటే.. కొవిడ్ రూల్స్​పాటించకుండా ర్యాలీ చేసిన నీ కొడుకును బొక్కలో ఏసి తొక్కు..  నీ కార్యకర్తలపై లాఠీలు ఝళిపించు. కార్యకర్తలు, జర్నలిస్టులు, టీచర్లను కొట్టిపిస్తవా.. ఎంత ధైర్యం? ఉద్యోగులు, టీచర్లు, నిరుద్యోగుల కోసం మేం చావడానికైనా సిద్ధంగా ఉన్నం” అని అన్నారు. 
నిరసన తెలిపే హక్కు లేదా?  ఈటల రాజేందర్
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల బదిలీల విషయంలో బండి సంజయ్ చేస్తున్న దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ ఆఫీసులో కూర్చుని నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేయడం అప్రజాస్వామికమని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. బండి సంజయ్, బీజేపీ కార్యకర్తలు శాంతియుతంగా ఉద్యోగులకు మద్దతు తెలుపుతూ జాగరణ దీక్ష చేస్తున్నారని, వారిపై విచక్షణా రహితంగా పోలీసులు లాఠీచార్జ్ చేయడం అమానుషమని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 
తీవ్రంగా ఖండిస్తున్నం: టీపీయూఎస్
జీవో నంబర్ 317లో సవరణలను కోరుతూ సంజయ్ చేపట్టిన దీక్షను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్ రావు, నవాత్ సురేశ్ అన్నారు. 
బండి సంజయ్​అరెస్ట్​ను ఖండించిన తరుణ్ చుగ్
సంజయ్​ అరెస్టును బీజేపీ రాష్ట్ర వ్యవహరాల ఇన్​చార్జి తరుణ్​చుగ్ ఖండించారు. జీవో 317ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా కరీంనగర్​లో జాగరణ దీక్షను అడ్డుకునేందుకు పోలీసులు ప్రవర్తించిన తీరు సరైంది కాదన్నారు. బలవంతంగా సంజయ్ ఆఫీస్​లోకి చొరబడి గ్యాస్ కట్టర్లతో కిటికీ గ్రిల్స్​తొలగించడం దారుణమని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డ ఆయన... ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఇది టీఆర్ఎస్ పతనానికి నాంది అని ట్వీట్ చేశారు.
సంజయ్​ అరెస్టు దుర్మార్గం
కరోనా రూల్స్​తో శాంతియుతంగా జాగరణ దీక్ష చేపట్టిన సంజయ్​ను పోలీసులు అరెస్ట్​ చేసిన తీరు దుర్మార్గం. టీఆర్ఎస్ మీటింగులకు లేని రూల్స్​ బీజేపీ మీటింగులకే ఎందుకు? కనీసం ఎంపీ క్యాంప్​ఆఫీసులోనైనా దీక్షకు అనుమతించాల్సింది.  క్యాంప్​ ఆఫీసులోకి  వాటర్​కొట్టి, గ్రిల్స్​ పగులగొట్టి  సంజయ్​ను పోలీసుల అరెస్ట్​చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సీఎం కేసీఆర్​ ఫక్తు  నియంతలా మారి, పోలీసుల సాయంతో ప్రతిపక్షాలను అణచివేస్తున్నరు.- వివేక్​ వెంకటస్వామి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు.