గ్రామస్తుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

గ్రామస్తుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
  • గ్రామ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పాదయాత్ర చేపట్టిన గ్రామస్తులు
  • రామన్నగూడెం నుంచి ప్రగతి భవన్ కు 360కిలోమీటర్లు పాదయాత్ర 
  • గ్రామం దాటేలోపలే ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:  గ్రామ సమస్యల పరిష్కారం కోరుతూ సీఎం క్యాంప్ ఆఫీస్ (ప్రగతి భవన్)కు పాదయాత్రగా బయలుదేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం వాసులను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర ప్రారంభించి గ్రామం దాటేలోపే..  పెద్ద సంఖ్యలో గ్రామానికి చేరుకున్న పోలీసులు పాదయాత్ర ప్రారంభించిన గ్రామస్తులను అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని.. వెంటనే విరమించుకోవాలని పోలీసులు చెప్పడంతో గ్రామస్తులు ఆగ్రహానికి లోనయ్యారు.  దీంతో పోలీసులు, గ్రామస్తులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో బలవంతంగా కొందరిని అక్కడి నుంచి లాక్కెళ్లి.. వాహనాల్లో ఎక్కించుకుని వెళ్లిపోయారు పోలీసులు.

పంచాయితీ పరిధిలోని భూములకు డిజిటల్ పట్టాదార్ పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని.. అటవీ శాఖ స్వాధీనం చేసుకున్న ఆదివాసీల భూములను తిరిగి అప్పగించాలనే ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రామన్నగూడెం నుంచి 200 మంది గూడెం వాసులు సోమవారం ఉదయమే తమ పిల్లలతో పాదయాత్రగా హైదరాబాద్ సీఎం క్యాంప్ ఆఫీస్ కు బయలుదేరారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని ఈ సందర్భంగా వారు తేల్చి చెప్పారు.
అయితే రామన్నగూడెం నుంచి హైదరాబాద్  బయలుదేరిన వందలాది మంది గిరిజనులను అశ్వారావుపేట శివారులోని వాగొడ్డిగూడెం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించడంతో వాగ్వాదానికి దిగారు గ్రామస్తులు. పాదయాత్రకు అనుమతి లేదని.. వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని చెప్పడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. మహిళలు, యువకులను లాక్కెళ్లి వ్యాన్ లో ఎక్కించారు. పలువురు మహిళలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఎన్నో ఏళ్లుగా తమ భూ సమస్యలను పరిష్కరించడం లేదని.. తమ బాధలు, కష్టాలను సీఎం దృష్టికి తీసుకెళితే పరిష్కారం అవుతాయనే ఆశతోనే పాదయాత్ర చేపట్టామని చెబుతున్నారు. పాదయాత్రను విరమించుకోవడంపై ఆదివారం అర్ధరాత్రి వరకు అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు గూడెం వాసులతో చర్చించారు. చర్చలు ఫలించలేదు. దీంతో పాదయాత్ర చేసి తీరుతామని చెప్పినట్లే గ్రామస్తులంతా కలసి పాదయాత్ర మొదలు పెట్టారు. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున రామన్న గూడెం వెళ్లిన పోలీసులు సర్పంచుతోపాటు గ్రామస్థులను బలవంతంగా అదుపులోకి తీసుకొని అశ్వారావుపేట పోలీసుస్టేషనుకు తరలించారు. 
తాము సీఎం కేసీఆర్ అభిమానులమని.. అందుకే పార్టీ జెండాలతో యాత్ర చేస్తున్నామని చెప్తున్నా పోలీసులు పట్టించుకోకుండా పాదయాత్రను అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆంధ్ర - తెలంగాణ సరిహద్దులో ఉన్న రామన్నగూడెం నుంచి హైదరాబాద్ కు దాదాపు 360 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. శాంతియుతంగా పాదయాత్ర చేస్తామని,  గ్రామంలో కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై సీఎం కేసీఆర్ ను కలుస్తామని చెబుతున్నారు.