మధుయాష్కీ ఇంట్లో అర్ధరాత్రి పోలీసుల సోదాలు

మధుయాష్కీ ఇంట్లో అర్ధరాత్రి పోలీసుల సోదాలు
  • మధుయాష్కీ ఇంట్లో అర్ధరాత్రి పోలీసుల సోదాలు
  • మద్యం, డబ్బులు పంచుతున్నట్లు కంప్లైంట్
  • ఏం దొరక్కపోవడంతో వెళ్లిపోయిన పోలీసులు
  • సుధీర్ రెడ్డి చెప్పడంతోనే తనిఖీలు: మధుయాష్కీ

ఎల్ బీనగర్, వెలుగు: ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేశారు. మద్యం, డబ్బులు పంచుతున్నారన్న ఫిర్యాదు మేరకు ఎన్నికల అధికారులతో కలిసి సోదాలు చేసినట్లు పోలీసులు చెప్పారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లో సోదాలు చేయడంపై మధుయాష్కీ గౌడ్​తో పాటు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి సోదాల్లో ఏమీ దొరక్కపోవడంతో పోలీసులు, ఎన్నికల అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 మంగళవారం అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో పోలీసులు, ఎన్నికల అధికారులు హయత్​నగర్​లోని మధుయాష్కీ గౌడ్ ఇంటికి వెళ్లారు. అప్పటికి మధుయాష్కీ ఇంట్లోనే ఉన్నారు. మద్యం, డబ్బులు పంచుతున్నారని డయల్ 100కు కంప్లైంట్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో తనిఖీలు చేయాల్సిందిగా వివరించారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని మధుయాష్కీ పోలీసులను ప్రశ్నించారు. అవేమీ పట్టించుకోకుండా సోదాలు చేసేందుకు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మధుయాష్కీ ఇంటికి చేరుకున్నారు.

 బలవంతంగా ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. సుమారు రెండు గంటల పాటు సోదాలు చేశారు. చివరికి ఏమీ దొరక్కపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎవరు కంప్లైంట్ చేశారో చెప్పాలని మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. ఒక్కసారిగా పోలీసులు ఇంట్లోకి చొరబడటంతో కుటుంబ సభ్యులంతా భయపడ్డారని వివరించారు.

ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నరు

ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే, తన ఇంటికి పోలీసులను పంపించి సోదాలు చేయించాడని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. సోదాల తర్వాత మధుయాష్కీ మాట్లాడారు. ‘‘ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఓడిపోతారనే భయంతో బీఆర్ఎస్ లీడర్లు పోలీసులను పావుల్లా వాడుకుంటున్నారు. భయపెట్టాలని చూస్తున్నారు. కానీ.. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక బబ్బర్ షేర్ అని బీఆర్ఎస్ లీడర్లకు తెలీదు. అడ్వకేట్​గా ప్రజలకు న్యాయం చేయడం, బెదిరిస్తే ఎదిరించడమే నాకు తెలుసు. సుధీర్ రెడ్డీ... నీ ఆటలు నా దగ్గర సాగవు”అని మధుయాష్కీ మండిపడ్డారు.