ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు: అంతా ‘ఇన్నోవేషన్’ నుంచే..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు: అంతా ‘ఇన్నోవేషన్’ నుంచే..
  • కంపెనీ డైరెక్టర్ ఇండ్లు, ఆఫీసుల్లో సిట్​సోదాలు
  • 3 సర్వర్లు, హార్డ్​డిస్కులు సీజ్​
  • ఇన్నోవేషన్​ల్యాబ్​ప్రతినిధుల స్టేట్​మెంట్లు రికార్డు
  • పోలీసుల దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్‌ఐబీకి టెక్నికల్‌ సపోర్ట్‌ అందించిన ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ లో హార్డ్‌ డిస్క్‌లను సిట్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ డైరెక్టర్ పాల్​రవికుమార్‌కు చెందిన బెంగళూరు, హైదరాబాద్‌ ఇళ్లలో.. ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ ఆఫీసుల నుంచి మూడు సర్వర్లు, ఐదు మినీ డివైజ్‌లు, హార్డ్‌ డిస్క్‌లతో పాటు రవికుమార్‌ ఇంట్లో దాచిన హార్డ్‌ డిస్క్‌లను సైతం సిట్‌ సేకరించినట్లు తెలుస్తోంది.

ఆ సమయంలో ల్యాబ్‌ సీనియర్​మేనేజర్​ రాగి అనంతచారి, సాఫ్ట్ వేర్​ఇంజినీర్ ఓలేటి సీతారాం శ్రీనివాస్ స్టేట్మెంట్లను సైతం సిట్‌ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో నిందితుడు ప్రణీత్‌ రావు ఈ ల్యాబ్‌ సహకారమే తీసుకున్నట్లు ఇదివరకే నిర్ధారణ అయ్యింది. అంతేకాదు.. ప్రతిపక్ష నేతల ఇళ్లతో పాటు మూడు జిల్లాల్లో ల్యాబ్‌ మినీ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటులో రవికుమార్‌ కీలక పాత్ర పోషించినట్లు సిట్‌ నిర్ధారించుకుంది. ఈ క్రమంలో తాజాగా సేకరించిన టెక్నికల్‌ ఎవిడెన్స్‌ సేకరణ దర్యాప్తును మలుపు తిప్పుతాయా? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రవికుమార్‌ను విచారణ చేపడతారా? నోటీసులు ఏమైనా జారీ చేశారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.