
హైదరాబాద్, వెలుగు: డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో హైకోర్టు ఆదేశాలను ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని శుక్రవారం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ట్రాఫిక్ పోలీసుల కస్టడీలో ఉన్న వెహికల్స్ ను శనివారం నుంచి రిలీజ్ చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6 వేలు, హైబరాబాద్లో 2 వేలు, రాచకొండ పరిధిలో వెహికల్స్‌ను వాహనదారులకు అప్పగించారు. డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనదారుల ఐడీ కార్డులు, అడ్రస్ తీసుకుని కోర్టుకు హాజరుకావాల్సిన తేదీలను వారికి చెప్తున్నారు. శనివారం రాత్రి సికింద్రాబాద్ మహంకాళి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ప్యాట్నీ సర్కిల్ వద్ద నిర్వహించిన చెకింగ్‌లో 6 కేసులు నమోదు చేశారు. 5 బైకులు, కారు డాక్యుమెంట్లు తీసుకుని వెహికల్స్‌ను రిలీజ్ చేశారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి కోర్టుకు హాజరుకావాల్సిన తేదీల వివరాలను తెలిపారు.