- కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగింత
పద్మారావునగర్, వెలుగు: నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ గొడవలతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు రైలు కింద పడి సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించాడు. రైల్వే ట్రాక్‌పై పరుగెత్తుతున్న అతడిని చూసిన స్థానికులు వెంటనే 112కు కాల్ చేశారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, లోకల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి యువకుడిని కాపాడారు. చంపాపేట్‌కు చెందిన ఓ యువకుడు (25) కొంతకాలంగా నిరుద్యోగిగా ఉంటున్నాడు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలతో తీవ్ర ఆందోళనకు గురై బుధవారం సికింద్రాబాద్ -సీతాఫల్‌మండి రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్‌పైకి వెళ్లాడు.
రైలు కింద పడి ప్రాణాలు తీసుకోవాలని భావించి పట్టాలపైనే పరుగెత్తడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే 112కు సమాచారం ఇచ్చారు. స్పందించిన చిలుకలగూడ బీసీ-1 పెట్రోలింగ్ టీమ్ అలుగడ్డబావి రైల్వే సిగ్నల్ దగ్గర యువకుడిని గుర్తించింది. పోలీసులు ఆపేందుకు ప్రయత్నించినా.. అతడు సీతాఫల్‌మండి వైపు పరుగెత్తాడు. దీంతో కానిస్టేబుల్ పి. శంకర్ దాదాపు 4 కిలోమీటర్లు వెంబడించి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం అతడి తల్లిదండ్రులను పిలిపించి అప్పగించారు.
