స్తంభంపల్లిలో ఉద్రిక్తత .. బోనాలను అడ్డుకున్న పోలీసులు

స్తంభంపల్లిలో ఉద్రిక్తత .. బోనాలను అడ్డుకున్న పోలీసులు

వెల్గటూర్, వెలుగు : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలో ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక సెగలు మిన్నంటాయి. తమకు పరిశ్రమ వద్దంటూ ఆదివారం గ్రామస్తులు మూకుమ్మడిగా మైసమ్మ బోనాలు తీయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల  ఘర్షణ చోటుచేసుకుంది. చివరకు పోలీసు వలయాన్ని ఛేదించుకుని వెళ్లి  మైసమ్మకు బోనా లు సమర్పించారు. ఆదివారం మధ్యాహ్నం సర్పంచ్ చల్లూరి స్వరూప రాణి, ఎంపీటీసీ సతీశ్​ఆధ్వర్యంలో 500 మంది గ్రామస్తులు ఇథనాల్​ఫ్యాక్టరీ నిర్మించే ప్రదేశానికి ర్యాలీగా బయలుదేరారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సుమారు 200 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీ నిర్మించే సర్వే నంబర్​1090 నిషేధిత ప్రాంతమని, ఎవరూ రావొద్దని సీఐ బిళ్ల కోటేశ్వర్ హెచ్చరించారు.

అయినా గ్రామస్తులు భయపడకుండా బోనాలు తీయడానికి  బయలుదేరారు. దీంతో వారిని పొలిమేరలోనే అడ్డుకున్నారు. రోప్​పార్టీలను ఏర్పాటు చేసి నిలువరించారు. ‘దేవుడికి బోనాలు పెట్టుకుంటుంటే మధ్యలో ఆపడానికి మీరెవరు’ అని గ్రామస్తులు వారిపై మండిపడ్డారు. తమ గ్రామానికి సంబంధించిన  భూమిని మీరెలా నిషేధిత ప్రాంతంగా ప్రకటిస్తారని ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఇది ఒకరినొకరు తోసేసుకునేవరకూ వెళ్లింది. కొద్దిసేపటికి గ్రామస్తులు, పోలీసులను నెట్టేసి ప్రాజెక్టు నిర్మించే ప్రదేశానికి చేరుకున్నారు. మైసమ్మకు బోనాలు సమర్పించి కోళ్లను కోసి వండుకు తిన్నారు. తమ ప్రాణాలను తీయడానికి వచ్చిన ఇథనాల్​ప్రాజెక్టు ఇక్కడి నుంచి తరలిపోయేలా చూడాలని మొక్కుకున్నారు.

మరోవైపు స్తంభంపల్లి గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు మైసమ్మ బోనాలకు వస్తున్న జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్​మండల అధ్యక్షుడు శైలేందర్ రెడ్డిలను పోలీసులు గ్రామ శివారులో అడ్డుకున్నారు. బోనాలకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించినా వినకుండా వెనక్కి పంపించేశారు.