భైంసాలో ‘ది కేరళ స్టోరీ’ నిలిపివేత... ప్రేక్షకులు వర్సెస్ పోలీసులు

భైంసాలో ‘ది కేరళ స్టోరీ’ నిలిపివేత... ప్రేక్షకులు వర్సెస్  పోలీసులు

నిర్మల్ జిల్లా భైంసాలో ‘ది కేరళ స్టోరీ’ నిలిపివేశారు. సినిమాను చూడటానికి థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులను పోలీసులు అడ్డుకున్నారు. కమల థియేటర్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. దీంతో సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులు, విద్యార్థి సంఘం, బీజేపీ నాయకులు పోలీసులపై మండిపడ్డారు. సినిమా చూసేంత వరకు థీయేటర్ దగ్గర నుంచి కదిలేదే లేదని భీష్మించుకొని కూర్చున్నారు. 

మే 12న (ఈ రోజు) ఉదయం 11గంటలకు కమల థీయేటర్ లో ది కేరళ స్టోరీ సినిమా ప్రదర్శస్తామని యాజమాన్యం బ్యానర్ పెట్టింది. దీంతో మూవీ చూడటానికి ప్రేక్షకులు వచ్చారు. అయితే అంతలోనే థియేటర్ యాజమాన్యం బ్యానర్ ను చింపేసి.. సినిమా ప్రదర్శించడం జరగదని తెలిపింది. అదీకాక పోలీసులు థియేటర్ ను చుట్టుముట్టారు. సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. థియేటర్ లో పెట్టిన బ్యానర్ చూసే సినిమా చూడటానికి వచ్చామని.. ఇప్పడు ఎందుకు యాజమాన్యం బ్యానర్ చింపేసిందని మండిపడ్డారు. అన్ని జిల్లాల్లోని థియేటర్లలో ది కేరళ స్టోరీ సినిమా నడుస్తోందని.. ఈ థియేటర్ లో ఎందుకు నడిపించడం లేదని నిలదీశారు. ఈ సినిమా ఏమైనా రాజకీయమా.. ఎందుకు మూవీ చూడద్దు అని విద్యార్థి సంఘాలు ప్రశ్నించాయి. మా ప్రశ్నలన్నింటికి యాజమాన్యం సమాధానం చెప్పేంత వరకు థియేటర్ నుంచి కదిలేదే లేదని భీష్మించుకొని కూర్చున్నారు.