షర్మిల కారులో ఉండగానే టోయింగ్ వెహికిల్తో లాక్కెళ్లిన పోలీసులు

షర్మిల కారులో ఉండగానే టోయింగ్ వెహికిల్తో లాక్కెళ్లిన పోలీసులు

వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ప్రగతి భవన్ ముట్టడించేందుకు సోమాజిగూడ వెళ్లిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. నిన్న దాడిలో ధ్వంసమైన కారులోనే ఆమె సోమాజిగూడకు వెళ్లారు. టీఆర్ఎస్ కార్యకర్తలు దహనం చేసిన బస్సును కూడా ప్రగతి భవన్ కు తీసుకెళ్లే  ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు షర్మిల కారుకు అడ్డంగా తమ వాహనాలను నిలిపారు. షర్మిలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో ఆమె కారు అద్దాలు మూసివేసి కారులోనే బైఠాయించారు. ముందుకు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

షర్మిల పోలీసుల మధ్య వాగ్వాదంతో పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. అయినా ఆమె కారు నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించారు. దీంతో ట్రాఫిక్ జాం, శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపిన పోలీసులు టోయింగ్ వెహికిల్ రప్పించి షర్మిల కారులో ఉండగానే దాన్ని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద కూడా షర్మిల కారు నుంచి దిగేందుకు నిరాకరించారు. అందులో కూర్చొనే నిరసన తెలుపుతున్నారు. అయితే ఓ పార్టీ అధ్యక్షురాలు కారులో ఉండగానే దాన్ని టోయింగ్ వెహికిల్ తో లాక్కెళ్లిన పోలీసులు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అంతకు ముందు లోటస్ పాండ్ లోని షర్మిల నివాసం వద్ద హైడ్రామా జరిగింది. ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో షర్మిల బయటకు రాకుండా ఆమె ఇంటి బయట భారీగా పోలీసులు మోహరించారు. ఆమెను హౌస్ అరెస్ట్ చేసేందుకు సిద్ధమ్యయారు. అయితే పోలీసుల కళ్లుగప్పిన షర్మిల వారికి తెలియకుండా సోమాజిగూడకు చేరుకున్నారు.

సోమవారం వైఎస్సార్టీపీ చీఫ్​ షర్మిల పాదయాత్రపై టీఆర్ఎస్​ కార్యకర్తలు దాడికి దిగారు. ఆమె ప్రయాణించే బస్సుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. కాన్వాయ్‍లోని వాహనాలపై రాళ్లదాడికి దిగారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి కూడా నిప్పుపెట్టారు. పాదయాత్ర కోసం ఊరురా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, జెండాలను ఎక్కడికక్కడ తగలబెట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి పోలీసులు షర్మిల యాత్రకు అనుమతి నిరాకరించారు. ఆమెను అరెస్ట్ చేసి పోలీస్​ వాహనంలో హైదరాబాద్ తరలించారు. దీంతో ఆదివారం 3,500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న షర్మిల పాదయాత్రకు వరంగల్​ జిల్లా నర్సంపేట నియోజకవర్గం శంకరమ్మ తండా వద్ద బ్రేక్ పడింది.