పోలీసుల నిఘా..బెదిరింపులకు భయపడం

పోలీసుల నిఘా..బెదిరింపులకు భయపడం

హైదరాబాద్, వెలుగు: తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న వీఆర్ఏలపై పోలీస్ శాఖ నిఘా పెంచింది. పేస్కేల్, అర్హులకు ప్రమోషన్లు, వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్ తో ఈనెల 13న చలో అసెంబ్లీ చేపట్టారు. వీఆర్​ఏలను కట్టడి చేయడంలో ఇంటెలిజెన్స్, పోలీస్ శాఖ విఫలమైందని ప్రభుత్వ పెద్దలు సీరియస్​ కావడంతో వారి కార్యకలాపాలపై పోలీసులు దృష్టి సారించారు. వీఆర్​ఏల వివరాలను ప్రత్యేక ఫార్మాట్ లో పంపాలని రాష్ట్రంలోని అన్ని పోలీస్​ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫార్మాట్​ ప్రకారం.. వీఆర్ఏ పేరు, వయస్సు, తండ్రి పేరు/భర్త పేరు, రెసిడెన్షియల్ అడ్రస్​, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ఊరు, మొబైల్ నంబర్, కనీసం ఇద్దరు బంధువుల పేర్లు, వారి మొబైల్ నంబర్లు పోలీసులు సేకరిస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వీఆర్ఏల వివరాలను పోలీస్ శాఖ సేకరించడంపై వీఆర్ఏ జేఏసీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమను బెదిరింపులకు గురిచేయడం కోసమే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నదని మండిపడుతున్నారు.

డిమాండ్లు నెరవేరే దాకా సమ్మె

ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలని, వెంటనే సమ్మె విరమించాలని 20న వీఆర్ఏలతో జరిగిన చర్చల్లో మంత్రి కేటీఆర్ కోరారు. ఈ చర్చల్లోఎలాంటి పురోగతి లేకపోగా, మరో 15, 20 రోజుల గడువు విధించడంతో వీఆర్ఏలు నిరాశకు చెందారు. 21న రాష్ట్ర జేఏసీ అన్ని జిల్లా జేఏసీల చైర్మన్లతో సమావేశమై చర్చించగా.. ప్రభుత్వంపై నమ్మకం లేదని, డిమాండ్లు నెరవేరే దాకా సమ్మె కొనసాగించాల్సిందేనని అన్ని జిల్లాల జేఏసీ చైర్మన్లు తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలోనే సమ్మెపై ఉక్కుపాదం మోపేందుకే పోలీసులు వీఆర్​ఏల సమాచారం సేకరిస్తున్నారనే చర్చ రెవెన్యూ శాఖలో సాగుతున్నది.