హైకోర్టు జడ్జీల ఫోన్లూ ట్యాప్ .. నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు 

హైకోర్టు జడ్జీల ఫోన్లూ ట్యాప్ .. నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు 
  • రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్​పై వాదనల సందర్భంగా ప్రస్తావన.. వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతి
  • ఇయ్యాల పోలీస్​ కస్టడీకి రాధాకిషన్​రావు
  • పోలీసుల అదుపులో ఓఎస్డీ వేణుగోపాల్​రావు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  హైకోర్టు జడ్జీల ఫోన్లను కూడా ప్రణీత్ రావు టీమ్ ట్యాప్‌‌‌‌ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌‌‌‌ రావు కస్టడీ పిటిషన్ పై వాదనల సందర్భంగా పోలీసులు ఈ విషయాన్ని నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. రాధాకిషన్ రావును 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా, దానిపై వాదనలు మంగళవారంతో పూర్తయ్యాయి.

వాదనల సందర్భంగా పోలీసులు కోర్టుకు కీలక వివరాలు వెల్లడించారు. రాజకీయ నాయకులు, ప్రైవేట్ వ్యక్తులతో పాటు హైకోర్టు జడ్జీల ఫోన్లను కూడా ప్రణీత్ రావు టీమ్ ట్యాప్ చేసిందని పోలీసుల తరఫున పీపీ వాదనలు వినిపించినట్టు తెలిసింది. టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ డీసీపీగా రాధాకిషన్ రావు చేసిన ఆపరేషన్స్ గురించి ఆధారాలు సేకరించాల్సి ఉన్నందున ఆయనను కస్టడీకి ఇవ్వాలని పీపీ కోరారు.

మునుగోడు, హుజూరాబాద్‌‌‌‌, దుబ్బాక బై ఎలక్షన్స్ సమయంలో రాధాకిషన్ రావు కీలక పాత్ర పోషించినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా, రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పై వాదనలు ముగియగా కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. ఆయనను వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. దీంతో గురువారం ఉదయం చంచల్‌‌‌‌గూడ జైలు నుంచి రాధాకిషన్ రావును పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. 

పోయినేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో నియోజకవర్గాల వారీగా వాట్సాప్‌‌ గ్రూప్స్‌‌ ఏర్పాటు చేసి, ప్రణీత్ రావు టీమ్ ఆపరేషన్స్ చేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. ప్రధానంగా హైదరాబాద్ సిటీతో పాటు కామారెడ్డి, గజ్వేల్‌‌, సిరిసిల్ల, వరంగల్‌‌ జిల్లాలోని మరో 2 నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారం కోసం ఎస్‌‌ఐబీ టీమ్‌‌ వాట్సాప్‌‌ గ్రూపులు ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో చేరవేసినట్టు ఆధారాలు సేకరించారు. వీటికి సంబంధించిన వివరాలను కూడా రాధాకిషన్ రావు కస్టడీ విచారణలో రాబట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా, ప్రణీత్‌‌ రావు సహా  ఇతర నిందితుల కాల్‌‌ డేటాను పోలీసులు ఇప్పటికే సేకరించినట్టు తెలిసింది.