
- కమాండ్ కంట్రోల్ స్టేషన్‌కు అనుసంధానం
- పోలీస్ స్టేషన్ల వారీగా ప్రతిరోజు సీసీటీవీల సమీక్ష
- సిబ్బంది పనితీరుపైనా ఫోకస్ ప్రత్యేక టీమ్ ఏర్పాటు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో నేరాలు అదుపు చేసేందుకు పోలీస్‌యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోంది. జిల్లా కేంద్రంతోపాటు భైంసా, ఖానాపూర్ పట్టణాలపై పోలీసులు పూర్తిస్థాయిలో నిఘా పెడుతున్నారు. ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీస్ శాఖ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ పకడ్బందీ నిఘా నిర్వహిస్తున్నారు. నేరస్తులను పకడ్బందీగా గుర్తించేందుకు జిల్లా పోలీస్ విభాగం ఆంబీస్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీని మరింత విస్తరించి నేరాలను అదుపు చేయాలని పోలీస్ విభాగం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా టీమ్ఏర్పాటైంది.
ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ..
నిర్మల్ జిల్లావ్యాప్తంగా పోలీసుల అనుమతితో ఇప్పటివరకు పదివేలకుపైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కాగా వాటన్నింటినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయనున్నారు. ఈ సీసీ కెమెరాలకు జియో ట్యాగింగ్ సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తుండడంతో కమాండ్ కంట్రోల్ స్టేషన్ కు సీసీ కెమెరాల దృశ్యాలు ఎప్పటికప్పుడు చేరుతూ.. ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియజేస్తుంది. దీంతో సంబంధిత పోలీస్ స్టేషన్ల సిబ్బందిని కమాండ్ కంట్రోల్ స్టేషన్ టీమ్ అప్ర మత్తం చేసి వెంటనే వారిని రంగంలోకి దింపనుంది.
సిబ్బంది పనితీరుపై కూడా..
సీసీ కెమెరాల అనుసంధానంతో కమాండ్ కంట్రోల్ స్టేషన్ టీమ్ ఇక నుంచి జిల్లాలో విధులు నిర్వహించే బ్లూ కోల్ట్స్ సిబ్బంది, పెట్రో కార్ సిబ్బంది పనితీరును సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షించనుంది. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే కమాండ్ కంట్రోల్ స్టేషన్ ద్వారా వెంటనే వారికి సమాచారం అందించనుంది. అలాగే వారి విధుల నిర్వహణను పర్యవేక్షించనుంది. సీసీ కెమెరాల లైవ్ దృశ్యాలతో సిబ్బందిని అప్రమత్తం చేసి వారిని వెంటనే రంగంలోకి దింపేందుకు రిమోట్ కంట్రోల్ పద్ధతిలో కార్యాచరణ చేపట్టనుంది.
ప్రధాన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
నిర్మల్ తోపాటు భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోని ప్రధాన ప్రాంతాలపై సీసీ కెమెరాల నిఘాను మరింత పటిష్టం చేయనున్నారు. ఈ మూడు పట్టణాల్లోని ఆలయాలు, మసీదులు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు, స్కూళ్లపై సీసీ కెమెరాలతో నిఘాను విస్తృతం చేయనున్నారు. కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదని గుర్తించిన పోలీసులు వాటన్నిటినీ పునరుద్ధరించనున్నారు.
ఈ టెక్నాలజీని పోలీస్‌శాఖ మరింత విస్తరించనుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు, అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు, రోడ్డు ప్రమాదాలకు కారకులైన వారిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటోంది.