ఉమ్మడి మెదక్ జిల్లాలో అభ్యర్థుల ఎంపికలో నేతలు బిజీ..

ఉమ్మడి మెదక్ జిల్లాలో అభ్యర్థుల ఎంపికలో నేతలు బిజీ..
  • పార్టీలు మారుతున్న ఆశావహులు, బీఫామ్​ల కోసం తీవ్ర ప్రయత్నాలు
  • ఉమ్మడి మెదక్ జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణలు 

సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు:  మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో పొలిటికల్ గేమ్ మొదలైంది. శుక్రవారంతో నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని బల్దియాల్లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు గెలిచే అభ్యర్థులపై దృష్టిపెట్టాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీల్లోని ముఖ్య నాయకులు, సిట్టింగ్, మాజీ కౌన్సిలర్లను తమ పార్టీలో  చేర్చుకుంటున్నాయి.

 చాలాచోట్ల కౌన్సిలర్ టికెట్ రాకపోవడంతో ప్రత్యర్థిని దెబ్బతీసే క్రమంలో రెబల్స్ గా బరిలో నిలిచేందుకు వ్యూహరచన చేస్తున్నారు. పార్టీలు రెబల్స్ కు సముదాయించి పోటీ నుంచి తప్పించే ప్రయత్నంలో సెకండ్ క్యాడర్ లీడర్లను రంగంలోకి దింపుతున్నారు. మొత్తం మీద బీఫాంల లొల్లి పూర్తయితే గానీ ఫైనల్ గా బరిలో ఉండే అభ్యర్థులు ఎవరో తెలియకుండా ఉంది.

సంగారెడ్డి జిల్లాలో.. 

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల పరిధిలోని 256 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు రెబల్స్ బెడద తప్పడం లేదు. ఒక్కో వార్డు నుంచి నలుగురేసి క్యాండిడేట్లు టికెట్ ఆశిస్తున్న వారు ప్రతీ పార్టీలో ఉన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ 33వ సీట్టింగ్ వార్డ్ కౌన్సిలర్ నవాబ్ నాగరాజుకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో 30వ వార్డు మంచి రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేయగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 

దీంతో బీఆర్ఎస్ పార్టీ అతడికి టికెట్ ఇచ్చింది. అందోల్- జోగిపేట మున్సిపాలిటీలో 9వ వార్డుకు చెందిన తుపాకుల సునీల్ నామినేషన్ కి ముందు రోజు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి బరిలో నిలిచాడు. ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు కొన్నిచోట్ల అభ్యర్థులు దొరకడం కష్టమైంది. 20వ వార్డులో అధికార పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థి కృష్ణారెడ్డిపై పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ఒక యువకుడిని ఖరారు చేసినప్పటికీ అతను అయిష్టంగా ఉండడంతో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ నాగభూషణాన్ని బరిలో దింపారు.

 నారాయణఖేడ్ మున్సిపాలిటీ 14వ వార్డులో కాంగ్రెస్ నుంచి ఆరుగురు, 9వ వార్డులో నలుగురు, 4వ వార్డులో నలుగురు అభ్యర్థులు టికెట్లు ఆశిస్తున్నప్పటికీ ఒకరికి ఛాన్స్ ఉండడంతో మిగతావారు పార్టీ మారేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితి కాస్త ఆయా వార్డుల్లో ప్రధాన పార్టీలకు ఇబ్బందికరంగా మారనుంది. రెబెల్స్ బెడద లేకుండా బుజ్జగింపుల పర్వం కొనసాగుతున్నాయి.                

మెదక్ జిల్లాలో.. 

మెదక్​ జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీల్లోని ముఖ్య నాయకులు, సిట్టింగ్, మాజీ కౌన్సిలర్లను తమ పార్టీలో చేర్చుకుంటున్నాయి. కౌన్సిలర్ టికెట్ ఆశించి భంగపడిన నాయకులు పార్టీలు మారుతున్నారు. మెదక్ మున్సిపాలిటీలో కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ కు చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ కొండన్ సావిత్రి, ఆమె భర్త మాజీ కౌన్సిలర్ కొండన్ సురేందర్ గౌడ్, మరో మాజీ కౌన్సిలర్ గోదల జ్యోతి  బీఆర్ఎస్ లో చేరారు. 

బీఆర్ఎస్ కు చెందిన  మాజీ కౌన్సిలర్, సొసైటీ మాజీ చైర్మన్ చింతల నర్సింలు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల కిష్టయ్య, మాజీ కౌన్సిలర్ మాడిశెట్టి అంజయ్య కాంగ్రెస్ లో చేరారు. శుక్రవారం బీఆర్ఎస్ కు చెందిన 21వ వార్డు సిట్టింగ్ కౌన్సిలర్ చందన సుమన్, 10వ వార్డు మాజీ కౌన్సిలర్  సాయిలు కాంగ్రెస్ లో చేరారు. 16 వ వార్డు కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. 

రామాయంపేట పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చౌదరి సుప్రభాతరావు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. నర్సాపూర్ కు చెందిన మాజీ జడ్పీటీసీ మాధవి బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు టికెట్ రాకపోవడంతో మంత్రి దామోదర సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.  

సిద్దిపేట జిల్లాలో..

జిల్లాలో చేర్యాల మినహా దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్​మున్సిపాలిటీల్లోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు వరకు వేచి చూస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. టికెట్లు ఆశించి భంగపడి గెలుపు అవకాశాలున్నవారిని బరిలోకి దించాలనే యోచనతో అభ్యర్థుల జాబితా ప్రకటనను వాయిదా వేస్తున్నాయి. 

హుస్నాబాద్ మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ ఐలేని అనితారెడ్డి  కాంగ్రెస్ లో చేరడమే కాకుండా పార్టీ తరపున కౌన్సిలర్లుగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. దుబ్బాకలో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు 18 వ వార్డు బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కుటుంబ సభ్యులను బరిలోకి దించాలని భావించినా టికెట్ దొరికే అవకాశం లేకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. 

చేర్యాల మున్సిపాలిటీలో ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన టీ.రాజేశ్‌‌ కు ఐదో వార్డు టికెట్ ఇచ్చారు. గజ్వేల్​కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి తనను వ్యతిరేకించే వర్గీయులను బుజ్జగించి ఐక్యంగా పోటీ చేసే విధంగా సర్దుబాటు చేసుకున్నారు.