
- ప్రచార పర్వంలో కాంగ్రెస్ ముందంజ
- అభివృద్ధి కార్యక్రమాలతో దూకుడు
- సానుభూతి ఓట్లపై బీఆర్ఎస్ ఆశలు
- టీడీపీ, జనసేనతో కలిసి ప్రచారం
- చేసే యోచనతో బీజేపీ
హైదరాబాద్‌సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల వేడి రాజుకుంటోంది. నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలతో ముందుకుపోతున్నాయి. ఈ నెల 30న ఓటర్ల తుదిజాబితా వెలువడనుండడం, త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో తలమునకలయ్యాయి.
ఇప్పటికే కాంగ్రెస్ ముగ్గురు మంత్రులను ఇన్‌చార్జీలుగా నియమించగా, బీఆర్ఎస్ కూడా ఒక్కో డివిజన్‌కు ఇన్‌చార్జీలుగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను నియమించింది. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల్ని కలుస్తున్నారు. ఇక మజ్లిస్ ఆచితూచి వ్యవహరిస్తున్నది.
కాంగ్రెస్ ముందంజ
జూబ్లీహిల్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని సీఎం రేవంత్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపుకోసం మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావులను ఇన్ చార్జీలుగా నియమించారు. వీరంతా నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో కార్యకర్తల సమావేశాలు నిర్వహి స్తున్నారు.
వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోతున్నారు.
నీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, రేషన్, తదితర సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 407 బూత్‌లలో ఒక్కో బూత్‌కు10 మంది చొప్పున చురుకైన కార్యకర్తలను ఎంపిక చేశారు.
ఇలా పక్కా ప్లాన్‌తో ముందుకు పోతున్నారు. అయితే, కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీలో ఉంటారన్న విషయం ఇంకా ఉత్కంఠను రేపుతోంది. మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, కాంగ్రెస్ యూత్ లీడర్ నవీన్యాదవ్తో పాటు మరికొందరు టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్ పేరిట నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం చర్చనీయాంశమైంది.
అంతకు ముందు మాజీ క్రికెటర్అజారుద్దీన్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపినా.. ఎమ్మెల్సీ ఆఫర్‌తో ఆయన ఆ ఆలోచన విరమించుకున్నారు. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పోటీ చేస్తారని ప్రచారం జరిగినా, ఆయన కూడా ఆ వార్తలను కొట్టిపారేశారు. బరిలో తాను లేనని, పార్టీ ఏ అభ్యర్థిని నిలిపినా గెలపుకు కృషి చేస్తానని ప్రకటించారు. మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.
సానుభూతి ఓట్లపై బీఆర్ఎస్ ఆశలు
ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్భార్య సునీతను బీఆర్ఎస్ బరిలోకి దింపే అవకాశం ఉందంటున్నారు. కొద్ది రోజుల కింద తెలంగాణ భవన్లో జరిగిన రహ్మత్‌నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సునీత అభ్యర్థిత్వంపై పరోక్షంగా సంకేతాలిచ్చారు.
మాగంటి గోపీనాథ్మరణంతో ఆయనపై ఉన్న సానుభూతి ఓట్లుగా మారి బీఆర్ఎస్కే పడతాయని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, మాగంటి గోపీనాథ్సోదరుడు కూడా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కవిత ఇక్కడ అభ్యర్థిని నిలిపే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో దివంగత పీజేఆర్తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఆమెను కలవడం చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ తరఫున మాగంటి కుటుంబానికి టికెట్ ఇస్తున్నారని వార్తలు వస్తున్న వేళ..విష్ణు తనకు టికెట్ రాదని నిరుత్సాహానికి గురయ్యాడని, అందుకే కవితను కలిశాడన్న ప్రచారం జరిగింది. అయితే, కొద్దిసేపటికే కేటీఆర్ నిర్వహించిన జూబ్లీహిల్స్ కార్యకర్తల మీటింగ్‌లో పాల్గొని తాను కేటీఆర్వెంటే ఉంటానని ప్రకటించారు. కవితను కేవలం దసరా ఉత్సవాలకు ఆహ్వానించడానికి మాత్రమే కలిశానని చెప్పి ఊహాగానాలకు తెరదించారు.
ఏదైనా భారీ మార్పులు చేర్పులు జరిగితే తప్పా జూబ్లీహిల్స్లో సునీత అభ్యర్థిత్వాన్ని మార్చే ప్రసక్తి లేదంటున్నారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని ఏడు డివిజన్లకు ఏడుగురు ముఖ్యనేతలను ఇన్‌చార్జీలుగా నియమించారు. ఇందులో కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు మాజీ ఎమ్మెల్యేలున్నారు. వీరంతా ఆయా డివిజన్ల కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నారు.
బీజేపీ నేతల కసరత్తు
జూబ్లీహిల్స్‌ను కైవసం చేసుకునేందుకు బీజేపీ సైతం పావులు కదుపుతోంది. ఇందుకోసం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌రావు నియోజకవర్గంపై ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే కొందరు ముఖ్యలీడర్లతో మానిటరింగ్కమిటీ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉండడంతో.. బీజేపీని గెలిపించుకునేందుకు ఆ పార్టీతో పాటు జనసేనను కలుపుకుని ప్రచారం చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన లంకెల దీపక్‌రెడ్డి ఆసక్తితో ఉన్నట్టు సమాచారం.
మహిళను కూడా పోటీకి దింపాలని ఆపార్టీ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అదే జరిగితే హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తనయ విజయలక్ష్మితో పాటు పార్టీ సీనియర్ లీడర్ జూలూరు కీర్తిరెడ్డి, డా.పద్మావీరపనేని పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. గత బుధవారం అకస్మాత్తుగా బీజేపీ సీనియర్ లీడర్ మాధవీలత సీన్లోకి వచ్చారు. తనకు టికెట్ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తాను కూడా పోటీలో ఉన్నానని చెప్పకనే చెప్పారు. దీంతో జూబ్లీహిల్స్లో రాజకీయం హీటెక్కింది.
మజ్లిస్ విషయంలో నో క్లారిటీ
ఈ ఉప ఎన్నికలో మజ్లిస్ వైఖరిపై స్పష్టత రావడం లేదు. కొద్ది రోజుల క్రితం తాము జూబ్లీహిల్స్లో పోటీ చేయనున్నట్టు సంకేతాలిచ్చినా ఇప్పుడు స్పందించడం లేదు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిని పోటీకి దింపితే కాంగ్రెస్‌కు మజ్లిస్మద్దుతు ఇస్తుందని, పోటీ చేయదన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్, మజ్లిస్పార్టీలు మిత్రులుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో మజ్లిస్పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.