షర్మిల ప్రకటనతో హీటెక్కిన రాజకీయం

షర్మిల ప్రకటనతో హీటెక్కిన రాజకీయం
  • షర్మిల ప్రకటనతో హీటెక్కిన రాజకీయం
  • పాలేరు నుంచి పోటీ చేస్తానన్న షర్మిల
  • టీఆర్ఎస్​ టికెట్ తనకేనంటున్న తుమ్మల, కందాల
  • బహుముఖ పోరు ఖాయమంటున్న విశ్లేషకులు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల వేడి ముందుగానే రాజుకుంది. వరుసగా బహిరంగ సభలు, ముఖ్య నేతల రాకపోకలతో సందడి కనిపిస్తుండగా, వైఎస్ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాలేరు సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో రాజకీయం మరింత హీటెక్కింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్​ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్​ నుంచి గెలిచి టీఆర్ఎస్​లో చేరిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్​ రెడ్డి మధ్య వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో వీళ్లిద్దరూ ప్రత్యర్థులు కాగా, ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా వారి వర్గీయులు మాత్రం తమ నేతకంటే.. తమ నేతకే టికెట్​ అంటూ ధీమాగా చెబుతున్నారు. ఇదే సమయంలో సాధారణ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే షర్మిల తాను పాలేరు నుంచి పోటీలో ఉంటానని అనౌన్స్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పటి నుంచే పార్టీ కేడర్​ను ప్రిపేర్​ చేసుకుంటూ, వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టడంతో ప్రత్యర్థులు కూడా తొందరపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


ఖమ్మం జిల్లాపై ఫోకస్


ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ, సీపీఎం కలిసి పోటీ చేశాయి. మిగిలిన జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా ఖమ్మం జిల్లాలో మాత్రమే ఒక ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెల్చుకుంది. ఏపీ రాష్ట్రానికి సరిహద్దుగా ఉండడం, అక్కడి రాజకీయ పరిస్థితుల ప్రభావం కూడా ఉమ్మడి జిల్లాలో ఎక్కువే. దీంతో షర్మిల ఖమ్మం జిల్లాపై ఎక్కువగా ఫోకస్​ పెట్టారనే అంచనాలున్నాయి. ఇక పాలేరు సెగ్మెంట్ లో 2,20,000 మంది ఓటర్లున్నారు. గిరిజనులు ఎక్కువగా ఉండడం, కాంగ్రెస్​ కేడర్, వైఎస్సార్​​అభిమానులు ఉండడం కలిసి వస్తుందన్న అంచనాతో షర్మిల పాలేరును సెలక్ట్ చేసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఆమె జిల్లాలో ప్రత్యక్షంగా బరిలో ఉంటే, మిగిలిన సెగ్మెంట్లలోనూ ప్రభావం ఉంటుందన్న అంచనాలున్నాయి. మరోవైపు 2014లో వైసీపీ తరపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం టీఆర్ఎస్​ లో ఉన్నారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు, కందాల ఉపేందర్​రెడ్డిలో ఎవరో ఒకరు టీఆర్ఎస్​ నుంచి బరిలో ఉండనున్నారు. కాంగ్రెస్​ నుంచి గతేడాది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రాయల నాగేశ్వరరావుతో పాటు మరికొంత మంది టికెట్ ఆశిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పాలేరులో  బహుముఖ పోరు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


టీఆర్ఎస్​లో సఖ్యత వచ్చేనా?


టీఆర్ఎస్​లో తుమ్మల నాగేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి మధ్య టికెట్ ఫైట్ జరుగుతుండగా, ఈ రెండు వర్గాల మధ్య సఖ్యత లేని విషయం చాలా సందర్భాల్లో బయటపడింది. ఇటీవల కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో వర్గ పోరును వీడి కలిసి పని చేయాలని చెప్పినా, గ్రౌండ్ లెవల్​లో లీడర్ల మధ్య మార్పు వచ్చిన పరిస్థితి లేదు. ఇక రీసెంట్ గా హైదరాబాద్​లో కేటీఆర్ తో వ్యక్తిగత భేటీ తర్వాత పాలేరు టికెట్ కచ్చితంగా తనకే వస్తుందన్న ధీమా తుమ్మలలో కనిపిస్తుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. కందాల ఉపేందర్​రెడ్డి అనుచరులు కూడా సిట్టింగ్  ఎమ్మెల్యేగా తమ నేతకే సీటు దక్కే ఛాన్సుందని అంటున్నారు. వీళ్లిద్దరిలో టీఆర్ఎస్​ టికెట్  దక్కని అభ్యర్థి పార్టీ మారే అవకాశం ఉందని పొలిటికల్ టాక్​ ఉంది. అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి గెలిచిన వాళ్లు ఆ తర్వాత టీఆర్ఎస్​లో చేరడంతో కాంగ్రెస్​ తరపున పోటీచేసే క్యాండిడేట్ ను ఆ పార్టీ కార్యకర్తలు కూడా అనుమానించే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలు తమకి కలిసి వస్తాయన్న ఆలోచన షర్మిలకు ఉన్నట్లు ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు.