
- ఇయ్యాల్నే40 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్
- మేనిఫెస్టో రెడీ.. భారీ వలసలకు ప్లాన్
- నేడు బీజేపీ గూటికి మాజీ మేయర్‌కార్తీకరెడ్డి
- ఎలక్షన్ ఇన్‌చార్జులను నియమించిన కాంగ్రెస్..నేడు ఫస్ట్‌లిస్ట్
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ కావడంతో రాజకీయ పార్టీల్లో హీట్ పెరిగింది. నామినేషన్ల దాఖలుకు మూడు రోజులే టైం ఉండటంతో అన్ని పార్టీలు ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. టీఆర్‌ఎస్‌అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌బుధవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అవుతున్నారు. సిట్టింగులు, కొత్తవారు ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలన్నది ఖరారు చేయనున్నారు. అటు బీజేపీ కూడా పని స్పీడప్ చేసింది. ఆ పార్టీ జీహెచ్ఎంసీ ఎలక్షన్ఇన్చార్జి భూపేంద్ర యాదవ్ బుధవారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇదే టైంలో ఇతర పార్టీల నుంచి భారీగా వలసలకు ప్లాన్ చేశారు. సిటీ మాజీ మేయర్‌కార్తీకరెడ్డి బుధవారం బీజేపీలో చేరనున్నారు. 40 మంది క్యాండిడేట్లతో బీజేపీ ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ కానుంది. మరోవైపు కాంగ్రెస్‌పార్టీ కూడా ఎలక్షన్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఎలక్షన్ ఇన్‌చార్జులను నియమించగా.. బుధవారమే క్యాండిడేట్ల తొలి లిస్టును ప్రకటించనుంది.
దుబ్బాక ఎఫెక్ట్‌తో రంగంలోకి కేసీఆర్..
ఇటీవలి దుబ్బాక ఎలక్షన్లో టీఆర్ఎస్ ఓడిపోవడంతో టీఆర్ఎస్ ఉలిక్కిపడింది. ఇదే టైంలో హైదరాబాద్‌పై బీజేపీ స్పెషల్‌గా ఫోకస్ పెట్టడంతో సీఎం కేసీఆర్ అలర్టయ్యారు. జీహెచ్ఎంసీలో బీజేపీ బలపడితే ఇబ్బంది అవుతుందని స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే బుధవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో భేటీ అవుతున్నారు. ఎవరెవరు ఏ డివిజన్ బాధ్యతలు చూడాలో దిశానిర్దేశం చేయనున్నారు. ఎలక్షన్ పూర్తయ్యే దాకా అంతా హైదరాబాద్‌లోనే ఉండి ప్రచారం చేయాలని ఆదేశించనున్నట్టు సమాచారం. ఇదే టైమ్‌లో కార్పొరేటర్లుగా ఎవరెవరికి చాన్స్ ఇవ్వాలో చర్చించి ఫైనల్ చేయనున్నట్టు తెలిసింది. అయితే తమ కార్పొరేటర్లపై టీఆర్‌ఎస్‌ఇప్పటికే మూడు సార్లు సర్వే చేయించి.. పనితీరుపై ఆరా తీసింది. అవినీతి ఆరోపణలు, సరిగా పనిచేయడం లేదన్న సమాచారం వచ్చినవారిని పక్కన పెట్టనున్నట్టు సమాచారం. ఎలాంటి ఇబ్బంది లేనిచోట క్యాండిడేట్లను కన్ఫామ్ చేశారని, నామినేషన్లు వేసేందుకు రెడీగా ఉండాలని ఫోన్ చేసి చెప్తున్నారని తెలిసింది. బుధవారం సాయంత్రంగానీ, గురువారంగానీ క్యాండిడేట్లను అధికారికంగా ప్రకటించనున్నారు. పోటీ, వివాదాలు ఎక్కువగా ఉన్న చోట్ల నామినేషన్ల చివరి రోజున టికెట్స్ కన్ఫామ్ చేసే అవకాశం ఉంది.
వలసల భయంతో..
పార్టీ టికెట్ దక్కని వారు బీజేపీలో చేరుతారని టీఆర్ఎస్లో భయం కనిపిస్తోంది. ఆ పార్టీలో ఒక్కో డివిజన్ నుంచి నలుగురి నుంచి పది మందిదాకా పోటీ పడుతున్నారు. అందులో టికెట్ దక్కని వారు బీజేపీలోకి వెళ్లడమో, ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగే అవకాశమో ఉందని భావిస్తున్నారు. ఇది టీఆర్ఎస్ క్యాండిడేట్లపై ఎఫెక్ట్ చూపిస్తుందని.. ఇలా రెబల్స్ బెడద లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చొరవ చూపాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించినట్టు తెలిసింది. నామినేటెడ్ పదవులు ఇస్తామని బుజ్జగించాలని సూచించినట్టు సమాచారం.
దీటుగా ఎదుర్కొనే వ్యూహంతో..
గ్రేటర్హైదరాబాద్లో టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొనే వ్యూహంతో బీజేపీ ముందుకెళుతోంది. దీనిపై పార్టీ కీలక నేతలు మంగళవారం భేటీ అయి చర్చించారు. బీజేపీకి భయపడే అధికార టీఆర్ఎస్ ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్తోందని.. దీన్ని గట్టిగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆధ్వరంలో మేనిఫెస్టో కమిటీ సమావేశమై పలు అంశాలను సిద్ధం చేశారు. మరోవైపు బీజేపీ తరఫున బరిలోకి దిగేందుకు పెద్ద సంఖ్యలో ఆశావహులు పార్టీ హెడ్డాఫీసుకు క్యూ కడుతున్నారు.
కాంగ్రెస్‌లో ఎలక్షన్ సందడి
గ్రేటర్‌ఎన్నికల షెడ్యూల్‌తో కాంగ్రెస్‌లో సందడి మొదలైంది. దుబ్బాక రిజల్ట్‌తో ఆ పార్టీ కొంత డీలా పడ్డా తిరిగి పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. జీహెచ్ఎంసీలో ఎక్కువ సీట్లు గెల్చుకుంటే వరుస ఓటముల నుంచి తేరుకోవచ్చని భావిస్తోంది. పార్టీకి బలమున్న డివిజన్లు అన్నింటినీ గెలవాలని పార్టీ శ్రేణులను ఆదేశించింది. ముఖ్యంగా మల్కాజిగిరి, చేవెళ్ల, హైదరాబాద్లోక్సభ సెగ్మెంట్ల పరిధిలో కాంగ్రెస్‌కు మంచి బలం ఉందని పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. సికింద్రాబాద్, మెదక్లోక్సభ పరిధిలోనూ సత్తా చాటేలా వ్యూహం పన్నుతున్నారు. నేతలంతా కలిసి జీహెచ్ఎంసీలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తేవాలన్న ఆలోచనలో ఉన్నారు. టీఆర్ఎస్ పై జనంలో ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి మద్దతు పొందాలని భావిస్తున్నారు. కాగా.. ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ ఇప్పటికే పీసీసీ నేతలతో సమావేశమై జీహెచ్ఎంసీ ఎలక్షన్లకు రెడీ కావాలని నిర్ణయించారు. ఇప్పుడు నోటిఫికేషన్ రావడంతో నేతలంతా అలర్ట్ అయ్యారు. గ్రేటర్‌పరిధిలోని 5 లోక్‌సభ సెగ్మెంట్లకు పీసీసీ చీఫ్ఉత్తమ్ ఎలక్షన్ కమిటీలను నియమించారు. గాంధీభవన్‌లో కమిటీ మెంబర్లతో భేటీ అయి.. క్యాండిడేట్ల ఎంపికపై చర్చించారు. బుధవారం పార్టీ క్యాండిడేట్లను ఖరారు చేస్తామని 21న మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
ఊపు మీదున్న బీజేపీ..
దుబ్బాక బైఎలక్షన్ గెలుపుతో ఊపుమీ దున్న బీజేపీ.. అదే జోష్‌తో జీహెచ్ఎంసీ ఎలక్షన్‌కు రెడీ అయింది. ఇప్పటికే పార్టీ లోకి వలసలు మొదలుకాగా.. వీలైనంత ఎక్కువ మందిని చేర్చుకొని టీఆర్ఎస్కు గట్టి షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఇప్పటికే ఎలక్షన్ కమిటీలను వేయడంతోపాటు.. జీహెచ్ఎంసీ ఎలక్షన్ ఇన్చార్జిగా నేషన ల్ లీడర్ భూపేంద్ర యాదవ్‌ను రంగంలో కి తెచ్చింది. ఆయనతోపాటు పలు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలకూ బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలోని కీలక నేతలు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ సెల్‌జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్, వివేక్‌వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, చింతల రామచంద్రారెడ్డిలతో మరో కమిటీని ఏర్పాటు చేసింది. బుధవారం భూపేంద్ర యాదవ్ హైదరాబాద్ రానున్నారు. ఆయన సమక్షంలో హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, పెద్ద సంఖ్యలో నేతలు బీజేపీలో చేరనున్నారు. బుధవారమే 40 మంది క్యాండిడేట్లతో తొలి లిస్టు విడుదల చేయనున్నారు. ఇందులో సిట్టింగ్‌కార్పొరేటర్లతోపాటు సీనియర్‌నేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన ముఖ్యనేతల కు చోటు దక్కే అవకాశం ఉంది.