సాగర్​లో మొదలైన ఆపరేషన్​ ఆకర్ష్​

సాగర్​లో మొదలైన ఆపరేషన్​ ఆకర్ష్​
  • సీఎం సభ తర్వాత వేగంగా మారుతున్న సమీకరణాలు
  • అభ్యర్థులు ఫైనల్​ అయ్యేనాటికి భారీగా చేరికలు ఉంటాయని అంచనా

నల్గొండ, వెలుగునల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌‌ నియోజకవర్గంలో పొలిటికల్‌‌ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్‌‌ను స్పీడప్‌‌ చేశాయి. రూలింగ్ పార్టీలోని అసంతృప్త కేడర్‌‌ను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి టీఆర్‌‌ఎస్‌‌ లీడర్ షిప్‌‌ను టార్గెట్‌‌ చేయగా, జానారెడ్డి వ్యతిరేక వర్గంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. బైపోల్‌‌లో టీఆర్‌‌ఎస్‌‌, బీజేపీలకు ఉమ్మడి ప్రత్యర్థి కాంగ్రెస్ కావడంతో ఆ పార్టీలో ఆర్థికంగా, సామాజికంగా ప్రభావితం చేసే లీడర్లను తమ పార్టీలో చేర్చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇదే క్రమంలో టీఆర్‌‌ఎస్‌‌లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను సైతం చివరి క్షణంలో తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చాన్స్‌‌ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి ఇవ్వకూడదన్న ఉద్దేశంతో జానారెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ముందస్తుగానే గ్రామ, మండల స్థాయిలో ఒకప్పుడు కాంగ్రెస్‌‌లో తనకు చేదోడువాదోడుగా ఉండి ప్రస్తుతం టీఆర్‌‌ఎస్‌‌లో కొనసాగుతున్న కేడర్‌‌ను తిరిగి సొంతగూటికి రప్పించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో జరుగుతున్న చేరికలన్నీ దాదాపు ఇలాంటివేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఓవైపు ఇదంతా జరుగుతుండగానే.. మరోవైపు జానారెడ్డికి వ్యతిరేకంగా ఉన్న బలమైన నేతలను బీజేపీ ఇప్పటికే తమ టీమ్​లో చేర్పించుకోవడంతో పొలిటికల్​ సీన్​ రసవత్తరంగా మారింది.

కేడర్​ జారిపోకుండా..

సీఎం కేసీఆర్​ బహిరంగ సభ తర్వాత సాగర్​ నియోజకవర్గంలో సమీకరణా లు వేగంగా మారుతున్నాయి. కేసీఆర్​ కాంగ్రెస్​ లీడర్లను టార్గెట్​చేయడంతోపాటు, సాగర్​ నియోజకవర్గ అభివృద్ధి గురించి పరోక్షంగా జానారెడ్డిని టార్గెట్​ చేయడంతో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది. సీఎం ప్రకటించిన వరాలతోపాటు, నియోజకవర్గంలో సర్పంచ్​లకు ఇవ్వాల్సిన ఉపాధి హామీ పెండింగ్​బిల్లులు క్లియర్​ చేశారు. రైతులకు వ్యవసాయ విద్యుత్​కనెక్షన్లు త్వరగా మంజూరు చేసేందుకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారు. అదేవిధంగా నెల్లికల్లులో వివాదాస్పదంగా మారిన పోడు భూముల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్​ స్వయంగా పర్యటించి భూముల సర్వే మొదలుపెట్టారు. దీంతో సీఎం సభకు ముందున్న ప్రతికూల పరిస్థితులు అధికార పార్టీలో ఇప్పుడు కనిపించకపోవడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కేడర్​జారిపోకుండా జాగ్రత్త పడుతున్నాయి. అదేసమయంలో టీఆర్ఎస్​లోని సెకండ్​కేడర్​పై ఫోకస్​ పెట్టాయి. సీఎం కామెం ట్ల తర్వాత జానారెడ్డి సైతం వాయిస్​ పెంచారు. టీఆర్ఎస్​ అగ్రనాయకత్వా న్ని టార్గెట్​ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.

సెకండ్​ కేడర్​ పైనే గురి

నియోజకవర్గంలో ఆర్థికంగా, సామాజికంగా ఓటు బ్యాంకు కలిగిన కులాల లీడర్లు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్​లను మచ్చిక చేసుకునే పనిలో కాంగ్రెస్, బీజేపీ​ లీడర్లు నిమగ్నమయ్యారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్​ నుంచి టికెట్​ఆశించి భంగపడ్డ నాయకులకు ఎర వేస్తున్నారు. సంస్థాగతంగా టీఆర్ఎస్​ బలంగానే ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ గ్రామ, మండల స్థాయిలో ఎలాంటి పదవులు లభించక పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో రగిలిపోతున్నవాళ్లు కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారు. ఇటీవలి కాలంలో నిడమనూరు, పెద్దవూర, గుర్రంపోడు, త్రిపురారం మండలాల్లో వివిధ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్​ అసంతృప్తులు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇదే క్రమంలో బీజేపీలో చేరేందుకు కూడా యువ నాయకత్వం పోటీ పడుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్​రెడ్డి, కడారి అంజయ్య నేతృత్వంలో వివిధ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్​నాయకులు బీజేపీలో చేరుతున్నారు. అయితే వలసలను కట్టడి చేయడంలో టీఆర్​ఎస్ నాయకత్వం ఫెయిలైందని, ఆ పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలే అందుకు కారణమని సీనియర్లు చెప్తున్నారు.

క్యాండిడేట్​ తేలితేనే..

టీఆర్ఎస్​ క్యాండిడేట్​ఎవరనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. టికెట్​ కోసం రూలింగ్​ పార్టీలో చాలామంది పోటీ పడుతున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు చివరి నిమిషంలో తమ గూటికి చేరతారనే నమ్మకం కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్​లో కూడా జానారెడ్డి కాకుండా ఆయన కొడుకు రఘువీర్​ పోటీకి దిగితే అప్పుడు బీజేపీకి ప్లస్​అవుతుందని అనుకుంటున్నారు.