ఓటర్ జాబితాకు రాజకీయ పార్టీలు సహకరించాలి: రోనాల్డ్ రోస్

ఓటర్ జాబితాకు రాజకీయ పార్టీలు సహకరించాలి: రోనాల్డ్ రోస్

హైదరాబాద్, వెలుగు: తప్పులు లేకుండా ఓటరు జాబితా తయారీలో రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ వంతు సహకారం అందించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్  కోరారు. ఓటరు జాబితాలో తప్పుల సవరణపై జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారులు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన నోడల్ అధికారులతో సోమవారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... ఆయా పార్టీల ప్రతినిధులు ఓటరు జాబితాపై  తెలియజేసిన అభ్యంతరాలను పోలింగ్ బూత్ ల మార్పుల పై పరిశీలించి రాతపూర్వకంగా సమాధానం అందజేయాలని ఆర్వోలు, ఈఆర్వోలను ఆదేశించారు.

సెకండ్ సమ్మరీ రివిజన్​లో భాగంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు క్యాంపెయిన్ లో ప్రత్యేకంగా బీఎల్వో యాప్ అందుబాటులో ఉందన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 15 సెగ్మెంట్లలో వివిధ రకాల తప్పులు లేదా సవరణలు ఉన్న 4.61 లక్షల ఓటర్లకు సంబంధించి ఫారం–8 ద్వారా తీసుకోవాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 4 లక్షల 20 వేల 299 దరఖాస్తులు సేకరించామన్నారు. మిగిలిన 41,269 దరఖాస్తులను కలెక్ట్ చేయాల్సి ఉందన్నారు.  సమావేశంలో అడిషనల్ కమిషనర్ శంకరయ్య, జోనల్ కమిషనర్లు వెంకటేష్ దెత్రె, వెంకన్న, రిటర్నింగ్ అధికారులు, ఇతర నోడల్ అధికారులు,  ఆయా పార్టీలకు చెందిన లీడర్లు  పాల్గొన్నారు.