
ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది ఫాస్ట్ బౌలర్లు తమదైన ముద్ర వేశారు. కొంతమంది స్వింగ్ తో బోల్తా కొట్టిస్తే మరి కొంతమంది తమ వేగంతో బయపెట్టేవారు. మరికొందరైతే బౌన్సర్లతో బ్యాటర్లకు చుక్కలు చూపించేవారు. వీరందరికి డిఫరెంట్ గా యార్కర్లతో ఇబ్బంది పెట్టే పేసర్లు ఉన్నారు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ తన ఆల్ టైమ్ టాప్-5 టెస్ట్ బౌలర్ల వ్యక్తిగత లిస్ట్ ను షేర్ చేశాడు. వీరిలో ఒక్కరు కూడా ఇండియన్ పేసర్ లేడు. క్రిక్‌ట్రాకర్‌కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ నుండి ఇద్దరు దిగ్గజాలుకు చోటివ్వగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లలో ఒకొక్కరికి ఛాన్స్ ఇచ్చాడు. వారెవరో ఇప్పుడు చూద్దాం..
షేన్ బాండ్ (న్యూజిలాండ్):
కెరీర్ ప్రారంభంలో ఫ్యూచర్ స్టార్ బౌలర్ గా కితాబులు అందుకున్న షేన్ బాండ్ కెరీర్ గాయాల కారణంగా స్వల్ప కాలానికే పరిమితమైంది. టెస్ట్ కెరీర్‌లో కేవలం 18 మ్యాచ్‌ల్లో 87 వికెట్లతో తన సుదీర్ఘ ఫార్మాట్ కెరీర్ ను ముగించాడు. యావరేజ్ 22.09 కాగా స్ట్రైక్ రేట్ 38.76 ఉంది. షేన్ బాండ్ స్ట్రైక్ రేట్ (కనీసం 2,500 బంతులు) లో ఆల్-టైమ్ బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉండడం విశేషం. బాండ్ ఫిట్ గా ఉన్న సమయంలో తన వేగంతో బ్యాటర్లకు చుక్కలు చూపించేవాడు.
మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా):
ఆస్ట్రేలియాకు లెఫ్టర్మ్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ ఈ లిస్ట్ లో రెండో స్థానంలో ఉన్నాడు. 2010 దశాబ్దంలో జాన్సన్ టాప్ బౌలర్. అతని బౌన్సర్లతో బ్యాటర్లను ఇబ్బందిపెట్టేవాడు. ఓవరాల్ గా జాన్సన్ తన టెస్ట్ కెరీర్ లో 28.40 సగటుతో 313 టెస్ట్ వికెట్లను పడగొట్టాడు. వీటిలో 12 సార్లు ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. 2013-14 యాషెస్ సిరీస్‌లో విశ్వరూపమే చూపించాడు. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 37 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.
►ALSO READ | Kevin Pietersen: పవర్ హిట్టర్స్, యార్కర్ల వీరులకు పండగే.. ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ రెండు కొత్త రూల్స్
షోయబ్ అక్తర్ (పాకిస్తాన్):
'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' అని పిలువబడే షోయబ్ అక్తర్ ను ఫెర్గూసన్ తన టెస్ట్ బెస్ట్ బౌలర్ల జాబితాలో చోటిచ్చాడు. ఎక్స్‌ప్రెస్ వేగంతో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టిన అక్తర్ బౌలింగ్ ఆడడం అప్పట్లో ఒక ఛాలెంజ్. క్రికెట్ చరిత్రలో 161.3 కి.మీ/గం వేగంతో వేగవంతమైన డెలివరీ రికార్డు సైతం ఈ పాక్ బౌలర్ పేరిట ఉండడం విశేషం. ఓవరాల్ టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే 46 టెస్ట్‌లలో 25.69 సగటుతో 178 వికెట్లు పడగొట్టాడు.
వసీం అక్రమ్ (పాకిస్తాన్):
ఫెర్గుసన్ జాబితాలో చేరిన మరో బెస్ట్ బౌలర్ పాకిస్తాన్ పేసర్ వసీం అక్రమ్. క్రికెట్ చరిత్రలో గ్రేటెస్ట్ లెఫ్ట్ హ్యాండర్ బౌలర్ గా అక్రమ్ కు పేరుంది. ఓ వైపు వేగంగా బంతులు వేస్తూనే బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. బాల్ ను రివర్స్ స్వింగ్ చేయడంలో తనకు తానే సాటి. 90 వ దశకంలో అక్రమ్ బౌలింగ్ ను ఎదుర్కోవడం బ్యాటర్లకు ఒక పీడకల. తన టెస్ట్ కెరీర్ లో ఓవరాల్ గా 104 మ్యాచ్‌ల్లో 23.62 సగటుతో 414 వికెట్లను అక్రమ్ తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో 25 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. 'సుల్తాన్ ఆఫ్ స్వింగ్' గా పేరు తెచ్చుకున్న అక్రమ్ వన్డేల్లో 500 వికెట్లను పడగొట్టిన ఏకైక బౌలర్.
కర్ట్లీ ఆంబ్రోస్ (వెస్టిండీస్):
వెస్ట్ ఇండియన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ కర్ట్లీ ఆంబ్రోస్ కు ఫెర్గూసన్ తన లిస్ట్ లో చోటు కల్పించాడు. ఆరడుగుల ఆంబ్రోస్ బౌన్సర్లను ఎదర్కోవడం 1980ల్లో బ్యాటర్లకు అతి పెద్ద పరీక్షగా మారింది. 1990 దశాబ్దంలో కూడా ప్రపంచ క్రికెట్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. అంబ్రోస్ టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే ఓవరాల్ గా 98 మ్యాచ్‌ల్లో 20.99 సగటుతో 405 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. వీటిలో 22 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. 1993లో ఆస్ట్రేలియాపై 1 పరుగుకు 7 వికెట్లు తీసి మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు.