ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో చికితకు ఘనస్వాగతం

ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో చికితకు ఘనస్వాగతం

ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో సత్తా చాటింది తెలంగాణ క్రీడాకారిణి చికిత తానిపర్తి. గోల్డ్ మెడల్ సాధించి స్వరాష్ట్రానికి వస్తున్న సందర్భంగా గురువారం (ఆగస్టు 28) ఆమెకు ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి అభినందించారు. 

కెనడాలోని విన్నిపెగ్‌లో జరిగిన టోర్నమెంట్‌లో ఇండియా తరఫున బరిలోకి దిగిన చికిత.. స్వర్ణ పథకం సాధించి చరిత్ర సృష్టించింది. ప్రపంచ యవనికపై భారత జెండా ఎగరవేసిన తెలంగాణ ముద్దుబిడ్డ చికితను అభినందించేందుకు మంత్రితో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, ఎమ్మెల్సీ బల్మారి వెంకట్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తదితరులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. చికితను అభినందించి ఘనస్వాగతం పలికారు. 

►ALSO READ | Kevin Pietersen: పవర్ హిట్టర్స్, యార్కర్ల వీరులకు పండగే.. ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ రెండు కొత్త రూల్స్

చికిత తానిపర్తి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన క్రీడాకారిణి. ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్స్‌లో అండర్-21 మహిళల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. కెనడా టూర్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చిన చికిత.. సొంతగడ్డకు వస్తున్న క్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు క్రీడాకారులు పెద్ద ఎత్తున చేరుకుని స్వాగతం పలికారు.