
బషీర్బాగ్, వెలుగు: రాజకీయ పార్టీలు నిరుద్యోగ ఖాళీల అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాచిగూడలో జరిగిన సమావేశానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీతో పాటు కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలను ప్రకటించాయని.. ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగుల సమస్యలు ఎలా పరిష్కారం చేస్తారో అందులో చెప్పడం లేదన్నారు. నిరుద్యోగ భృతి అంశం, స్వయం ఉపాధి పథకం ఎలా కల్పిస్తారో చెప్పాలన్నారు.
రాష్ట్రంలో 25 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం, ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వివిధ శాఖల్లో 2 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కొత్తగా ఏర్పడ్డ 23 జిల్లాల్లో 40 శాఖల జిల్లా ఆఫీసులు, తాలూకా ఆఫీసులు ఏర్పడ్డాయని.. కానీ ఖాళీలు భర్తీ చేయలేదన్నారు. కొత్త పోస్టులు సృష్టించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. రాజకీయ పార్టీలు నిరుద్యోగ యువతను విస్మరిస్తే, ఆయా పార్టీలను చిత్తుగా ఓడిస్తారని కృష్ణయ్య హెచ్చరించారు. సమావేశంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నాయకులు నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు.