షోర్షే ఇలిష్, ఇలిష్ పటూరి..ఇవేంటో అనుకునేరు..ఇవి ప్రముఖ బెంగాలీ వంటకాలు..ఇలిష్, అకా,హిల్సా చేపలతో ఈ రుచికరమైన కూరలను వండుతారు. టేస్ట్ సూపర్ గా ఉంటుంది. అయితే వీటిగురించి ఇప్పుడెందుకు అంటున్నారా.. బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న సంక్షోభం, హింస, ప్రధాని హసీనా రాజనామా, ఆమె ఇండియాకు పారిపోవడం, అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు వంటి పరిణామాలతో ఈ వంటకాలు బెంగాల్ లో దొరకడం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి ఈ వంటకాలకు కావాల్సిన ఇలిష్ , అకా, హిల్సా చేపల దిగుమతి నిలిచిపోయింది.
ఇలిష్ , అకా, హిల్సా చేపలు ప్రధానంగా బంగ్లాదేశ్ లోని పద్మా నది లో ఎక్కువగా దొరుకుతాయి. ఈ చేపలు ప్రతి యేడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు దొరకుతాయి. మన దేశానికి గిఫ్ట్ గా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇండియాలోని పశ్చిమ బెంగాల్కు ఈ చేపలను పంపిస్తుండేది. అయితే ఈ సారి బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభంతో ఆంక్షల కారణంగా చేపల దిగుమతి ఉండకపోవచ్చంటున్నారు. దీంతో బెంగాల్ లోని చేపల వ్యాపారులు, అటు, ఈ చేపలను ఇష్టపడేవారు తీవ్ర నిరాశలో ఉన్నారు.
సాధారణంగా బంగ్లాదేశ్లో ఈ సీజన్ లో హిల్సా చేపలకు మంచి డిమాండ్ ఉంటుంది. పశ్చిమ బెంగాల్ వాసులు ఈ చేపలను ఎక్కువగా ఇష్టపడతారు. ఈ క్రమంలో బెంగాలీ చేపల వ్యాపారులు బాగానే సంపాదిస్తారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం మిలిటరీ పాలనతో ఇండియా, బంగ్లాదేశ్ ల మధ్య ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు విధించారు.దీంతో బెంగాలీ చేపల వ్యాపారులకు నిరాశ మిగిలింది.
ఇంతకుముందు 2012లో కూడా బంగ్లాదేశ్ హిల్సా చేపల ఎగుమతులను నిలిపివేసింది. దేశంలో హిల్సా చేపల డిమాండ్ పెరగడంతో ఎగుమతులు నిలిపివేశారు. భారతదేశంతో సత్సంబంధాల కారణంగా షేక్ హసీనా బెంగాలీలకు ఇష్టమైన ఈ చేపల సరుకులను భారతదేశానికి బహుమతిగా పంపిస్తుంది. ఇది బంగ్లాదేశ్ నుంచి పెట్రాపోల్ సరిహద్దు మీదుగా బొంగావ్ మీదుగా పశ్చిమ బెంగాల్‌కు చేరుకుంటుంది. ఆపై చేపలకు డిమాండ్ ఉన్న దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు.