- విచారణ జరపాలన్న బండి సంజయ్
- ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేస్తామన్న సీఎం రేవంత్
- కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు సైలెన్స్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం చుట్టూ రాజకీయ దుమారం చెలరేగుతున్నది. తాజాగా ఆయన తల్లి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ‘‘నా కొడుకు మరణాన్ని మిస్టరీగా మార్చారు. ఏం జరిగిందో కేటీఆరే చెప్పాలి” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గోపీనాథ్ మరణంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ తనకు లేఖ రాస్తే విచారణ జరిపించేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు.
అయితే.. గోపీనాథ్ తల్లి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ గానీ, బీఆర్ఎస్లోని ఇతర ముఖ్యనేతలుగానీ స్పందించకపోవడం చర్చకు దారితీసింది. తన కొడుకుది సహజ మరణం కాదని, మిస్టరీ అని, ఎలా చనిపోయాడో తమకు తెలియదని రెండురోజుల కింద మాగంటి గోపీనాథ్ తల్లి మీడియా ముందు కంటతడిపెట్టారు. తన కొడుకు ఆస్పత్రిలో మూడు రోజులు ఐసీయూలో ఉన్నాడనే విషయం ఇతరులు చెప్తేనే తనకు తెలిసిందని, అంతేకాకుండా.. ఆస్పత్రికి వెళ్తే కన్నతల్లి అయిన తనను కొడుకు వద్దకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని మార్లు ప్రాధేయపడినా వెళ్లనీయలేదన్నారు.
‘‘ఒకసారి కేటీఆర్ కన్పిస్తే ఆయన దగ్గరకు వెళ్లి, నా కొడుకును చూడనియ్యటంలేదని చెప్తే.. ఆయన కనీసం పట్టించుకోలేదు. కేటీఆర్ వచ్చి వెళ్లాక గోపీనాథ్ మరణ వార్తను ప్రకటించారు.. దీని వెనుక ఏం జరిగిందో కేటీఆర్ మాత్రమే చెప్పాలి’’ అని మాగంటి గోపినాథ్ తల్లి డిమాండ్ చేశారు. ‘‘నా కొడుకు చనిపోయేటప్పుడు అతనికి 63 ఏండ్లు. నాకు 92 ఏండ్లు.. మూడు రోజులు నా కొడుకు చూపు కోసం పరితపించినా నన్ను లోనికి రానివ్వలేదు” అని తెలిపారు. ఆమె ఈ ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జూబ్లీహిల్స్ పోలింగ్ తేదీ దగ్గరపడ్తున్న వేళ ఈ అంశం పార్టీల చేతికి బలమైన అస్త్రంలా మారింది.
మాగంటి గోపీనాథ్ తల్లి వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్.. మాగంటి గోపినాథ్ మరణంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మాట్లాడిన ఆయన.. ‘‘మాగంటి గోపీనాథ్ తల్లి నేరుగా ఆరోపణలు చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది” అని ప్రశ్నించారు. ‘‘ఇది గుండెపోటు కాదు, కచ్చితంగా ఆస్తి కోసం జరిగిన హత్య. కేటీఆర్ లాంటి వ్యక్తులు తమ మిత్రులనే వదలడం లేదు.
సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే, ఈ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి’’ అని డిమాండ్‌చేశారు. బండి సంజయ్ చేసిన సవాల్‌పై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో లెటర్ రాస్తే ఎంక్వైరీ చేయించేందుకు తాను సిద్ధమన్నారు. ‘‘ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి పొందాలని నేను అనుకోవడం లేదు. కానీ, మాగంటి గోపీనాథ్ తల్లి తన కుమారుడి మరణానికి కేటీఆర్ కారణం అని అన్నట్లు నేను మీడియాలో చూశాను. ఇప్పుడు సంజయ్ కూడా అదే ఆరోపణ చేస్తున్నారు’’ అని సీఎం పేర్కొన్నారు.
కేటీఆర్ సైలెన్స్ !
ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ మరణంపై రాజకీయ దుమారం చెలరేగుతున్నప్పటికీ.. మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు. బండి సంజయ్ నేరుగా కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేసినా.. మాగంటి కుటుంబ సభ్యులు తీవ్ర వ్యాఖ్యలు చేసినా.. బీఆర్‌ఎస్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రతిస్పందన లేదు. కేవలం మాగంటి గోపీనాథ్ పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తూ ప్రకటనలకే పరిమితమైన బీఆర్‌ఎస్ నాయకత్వం.. విచారణ డిమాండ్‌పై మౌనం వహించింది.
