టీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ డైరెక్ట్ ఫైట్ 

టీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ డైరెక్ట్ ఫైట్ 
  • ట్విట్టర్​లో మంత్రుల విమర్శలు
  • లైవ్​లోకి వచ్చి గట్టి కౌంటర్ 
  • ఇస్తున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు

హైదరాబాద్‌‌, వెలుగు: టీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ తీవ్రమవుతోంది. కేంద్ర బడ్జెట్​పై సీఎం కేసీఆర్ ప్రెస్​మీట్ తో రెండు పార్టీల మధ్య పొలిటికల్ హీట్ పెరిగింది. శనివారం ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్​తో ఇది మరింత ముదిరింది. హైదరాబాద్ వచ్చిన ప్రధానికి కేసీఆర్ ఆహ్వానం పలకకపోవడమే కాకుండా అన్ని ప్రోగ్రామ్స్​కు డుమ్మా కొట్టడం.. సీఎం తీరుపై బీజేపీ లీడర్లు విమర్శలు చేయడం, శనివారం సాయంత్రం నుంచి టీఆర్​ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదే పనిగా ట్వీట్లు చేయడంతో రెండు పార్టీల మధ్య ఫైట్​ డైరెక్ట్​గా మారింది. టీఆర్​ఎస్ లీడర్ల ట్వీట్లకు బీజేపీ లీడర్లు, కేడర్​ కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఎవరూ.. ఎవరికీ తీసిపోకుండా మాటల తూటాలు పేలుస్తున్నారు. టీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు సోషల్‌‌ మీడియాలో ‘ఈక్వాలిటీ ఆఫ్‌‌ తెలంగాణ’ పేరుతో విమర్శలు గుప్పిస్తుండగా, బీజేపీ నేతలు లైవ్‌‌లోకి వచ్చి ఏకిపారేస్తున్నారు.

కేటీఆర్​తో మొదలు.. ​
వివ‌‌క్షకు చిహ్నం లాంటి వ్యక్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆవిష్కరించ‌‌డం చూస్తుంటే వ్యంగ్యం కూడా కొన్ని కోట్ల సార్లు చ‌‌చ్చిపోతుంద‌‌ని మంత్రి కేటీఆర్‌‌ ట్వీట్ చేశారు. ‘ఐకాన్ ఆఫ్ పార్షియాలిటీ అన్​వీల్డ్​’ (వివక్షకు చిహ్నం ఆవిష్కృతమైంది) అని పేర్కొన్నారు. ‘తెలంగాణకు నిధుల మంజూరు విషయంలో వివక్షను ఇప్పటికైనా వీడండి ప్రధాని గారు’ అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ట్వీట్ చేశారు. మరో మంత్రి జగదీశ్​ రెడ్డి.. ‘తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మోడల్ స్టేట్​గా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే నాలుగో అతి పెద్ద రాష్ట్రం. కానీ నిధుల మంజూరులో కేంద్రం వివక్ష చూపుతోంది” అని అన్నారు. ‘‘తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు అడిగితే ఎవ్వరికీ ఇవ్వట్లేదన్నారు. మధ్యప్రదేశ్​కూ ఇచ్చారు. కర్నాటకలో అప్పర్​ భద్రకు ఇచ్చారు. మరి పాలమూరు సంగతేంటి ప్రధాని గారు” అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ట్వీట్​లో రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, దురదృష్ట వశాత్తు కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేడం లేదన్నారు. ‘‘విభజన చట్టంలో హామీలను అమలు చేయకుండా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నది. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి పట్టించుకోండి ప్రధాని గారు” అంటూ గంగుల కమలాకర్ ట్వీట్ చేశారు. అనేక రాష్ట్రాలకు విద్యా సంస్థలు ఇచ్చి, తెలంగాణకు మొండి చెయ్యి చూపుతున్నారని మంత్రి సబిత ట్వీట్ చేశారు. ‘‘ప్రధాని సార్​, ఎప్పుడూ టీమ్​ ఇండియా అంటూ గొప్పలు చెప్పుకునే మీరు తెలంగాణ విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారని ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ ట్వీట్​కు ఎమ్మెల్యే రాజాసింగ్​ ‘బర్నాల్​ మూమెంట్’ అంటూ చురక అంటించారు.