తన చర్యలతో, వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి ఆ తరహా వ్యాఖ్యలు చేశారు. అసలే శ్రీవారి లడ్డూని వివాదాలు చుట్టుముట్టిన వేళ.. తిరుమల తిరుపతిని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలనే కొత్త వాదన తీసుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
చంద్రబాబు హిందువు కాదు.. నాస్తికుడు
శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన కేఏ పాల్.. చంద్రబాబు తమ ఎన్నికల హామీలపై ప్రజల ద్రుష్టి మరల్చేందుకే ఈ వివాదం సృష్టించారని ఆరోపించారు. నిజానికి చంద్రబాబు నాయుడు హిందువు కాదని, ఆయన నాస్తికుడని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో డీజీపీ, ఎస్పీలకు తగు ఆదేశాలు జారీ చేసి లడ్డూపై రాజకీయ ప్రచారం జరుగకుండా చర్యలు తీసుకోవాలని పిల్ వేసినట్లు ఆయన తెలిపారు. జూలై నెలలో నివేదిక వస్తే సెప్టెంబర్ లో దీని గురించి మాట్లాడారంటే.. ఇందులో ఎంత మోసం ఉందో ప్రజలు ఆలోచించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు అన్నారు.
ఉదాహరణగా వాటికన్ దేశం
740 మంది క్యాథలిక్స్ కోసం వాటికన్ ప్రత్యేక దేశంగా ఉన్నప్పుడు.. 34 లక్షల మంది ప్రజలు, మూడు లక్షల కోట్ల ఆస్తులున్న తిరుపతిని ఎందుకు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించకూడదని కేఏ పాల్ ప్రశ్నించారు. యూనియన్ టెర్రిటరీగా చేయడం కుదరకపోతే ప్రత్యేక దేశంగానైనా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.