ట్విట్టర్ చుట్టూ లీడర్స్

ట్విట్టర్ చుట్టూ లీడర్స్

హైదరాబాద్, వెలుగు: ఇంతకాలం ప్రెస్ మీట్లు పెట్టి.. ప్రెస్ నోట్లు ఇచ్చి.. జనంలో తిరిగి... రాజకీయంగా నువ్వా నేనా అన్నట్లుగా సవాల్​ విసురుకున్న లీడర్లందరూ ఇప్పుడు ట్విట్టర్​ చుట్టూ తిరుగుతున్నారు. ఇష్యూ ఏదైనా ట్వీట్లతోనే స్పందిస్తున్నారు. పొలిటికల్​ పంచ్​లకు, పరస్పర విమర్శలకు, సవాళ్లకు, ప్రతిసవాళ్లకు, బెదిరింపులకు ట్విట్టర్​ను వేదికగా చేసుకుంటున్నారు. తాము ఎక్కడుండి ట్వీట్​ చేసినా.. అది తాము అనుకున్న జనానికి నేరుగా చేరిపోతుందని లీడర్లు నమ్ముతున్నారు.  పైగా.. ప్రెస్‌మీట్లు పెట్టి, ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటే.. అడిగిన ప్రతి అంశానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని, ట్వీట్టర్​లో అయితే తాము అనుకున్నది మాత్రమే చెప్పేయొచ్చని వారు భావిస్తున్నారు. 

ట్విట్టర్​ యూజర్లు తక్కువే అయినా..!

నిజానికి రాష్ట్రంలో ట్విట్టర్ వాడేవాళ్లు తక్కువే. మొబైల్ ఉన్న వారిలో ట్విట్టర్​ యూజర్లు 15 నుంచి 22 శాతంలోపే ఉన్నట్టు సర్వేలు చెప్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ట్విట్టర్ వాడే వారి సంఖ్య మరీ తక్కువ. కానీ, లీడర్ల ట్వీట్లను.. టీవీలు, న్యూస్​ పేపర్లు ఎప్పటికప్పుడు చూపెడుతుండటం, పబ్లిష్ చేస్తుండటంతో ట్విట్టర్ వాడని జనం కూడా ట్వీట్ల గురించి మాట్లాడుకుంటున్నారు. అందుకే లీడర్లు ట్విట్టర్​ వైపు మొగ్గు చూపుతున్నారు. ‘ఆస్క్​ కేటీఆర్​’ హ్యాష్​ ట్యాగ్​తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నెటిజన్లతో ఇంటరాక్ట్​ అవుతున్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్​  ఒవైసీ, మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వైఎస్సార్ టీపీ చీఫ్​ షర్మిల, బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ఎంపీ ధర్మపురి అర్వింద్,  ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. 

గవర్నర్ కు ట్విట్టర్ లో జనం గోడు

తమ సమస్యలు ప్రభుత్వానికి చెప్పినా నిర్లక్ష్యానికి గురవుతున్న వాళ్లు తమ గోడును గవర్నర్ తమిళిసైకి ట్విట్టర్​ వేదికగా చెప్పుకుంటున్నారు. ఆమె కూడా ట్విట్టర్​లో యాక్టివ్‌గా ఉంటూ సమస్యలు చెప్పుకునే వారికి ఓదార్పునిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఆస్క్ గవర్నర్’ హ్యాష్ ట్యాగ్‌తో గవర్నర్​ తమిళిసై ఇంటరాక్ట్ అయితే పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. వాటిని గవర్నర్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు పంపి పరిష్కరించాలని ఆదేశించారు.