ముత్తిరెడ్డికి ఉత్తచేయి.. ప్రగతిభవన్ వెళితే టైం ఇవ్వని కేసీఆర్

ముత్తిరెడ్డికి ఉత్తచేయి.. ప్రగతిభవన్ వెళితే టైం ఇవ్వని కేసీఆర్
  • ముత్తిరెడ్డికి ఉత్తచేయి..
  • ప్రగతి భవన్ వెళితే టైం ఇవ్వని కేసీఆర్
  • బేగంపేటలో పల్లాకు అనుకూల వర్గం మీటింగ్
  • వాళ్లను క్యాంప్ ఆఫీసుకు తీసుకెళ్లిన పల్లా
  • పోటీగా ప్రెస్ మీట్ పెట్టించిన యాదగిరిరెడ్డి
  • రోజురోజుకూ ముదురుతున్న జనగామ జగడం

హైదరాబాద్ : గులాబీ పార్టీలో జనగామ జగడం రోజురోజుకూ ముదురుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నట్టుగా సాగుతోంది. బీఆర్ఎస్ జనగామ టికెట్ ను ప్రధానంగా ముగ్గురు ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డితోపాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రేసులో ఉన్నారు. ఇందులో పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ కు బాగా దగ్గరన్న విషయం అందరికీ తెలిసిందే. 

మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు. అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జనగామ జిల్లాలో పర్యటిస్తూ.. చాపకింద నీరులా తన బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సిటీ శివారు మల్లాపూర్ లోని ఓ ఫంక్షన్ హాలులో అనుచరులతో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ప్రగతి భవన్ వెళ్లి సీఎంను కలిసేందుకు ప్రయత్నించగా టైం ఇవ్వలేదు. 

అదే సమయంలో జనగామకు చెందిన నాయకులతో పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుకూల వర్గం బేగంపేట టూరిజం ప్లాజా హోటల్ లో సమావేశమైంది. అనంతరం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన మద్దతుదారులను తీసుకొని వెళ్లి సీఎం కేసీఆర్ కు కలిపించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులకు సమయం ఇవ్వడం అనేక విశ్లేషనలకు దారి తీసింది. 

ముత్తిరెడ్డికి ఈ సారి టికెట్ ఇవ్వరేమోనన్న వాదనకు మరో మారు బలం చేకూరినట్లయింది. ఇవాళ ఉదయం జనగామలోని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముత్తిరెడ్డికి మూడో సారి అవకాశం ఇవ్వాలని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ముత్తిరెడ్డిని కాదని వెళ్లినవారు పునరాలోచించుకోవాలన్నారు. 

ముత్తిరెడ్డి వల్లే పదవులు అనుభవించి అలా వెళ్లడం సరికాదని చెప్పారు. జనగామలో గ్రూపు రాజకీయాలు చేయొద్దని, ఇక్కడి ప్రజలు పల్లా రాజేశ్వర్ రెడ్డిని నమ్మరు అని అన్నారు. జీడిమెట్లలో వడ్డెర కులస్తులకు చెందిన మూడెకరాల జాగాను ఆక్రమించుకున్న పల్లా ఇకనైనా నీచ నిక్రుష్ట చర్యలు మానుకోవాలని వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. 

పల్లా వర్సెస్ ముత్తిరెడ్డి 

భూకబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముత్తిరెడ్డి యాదగిరికి టికెట్ దక్కుతుందా..? లేదా..? అన్న చర్చ కొంతకాలంగా సాగుతూనే ఉంది. ఇటీవల ఆయన కుమార్తె తుల్జాభవానీ రెడ్డి తన తండ్రి యాదగిరిరెడ్డి చేర్యాలలో చెరువును కబ్జా చేసి తన సంతకం ఫోర్జరీ చేసి పట్టా చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విపక్షాలతో కలిసి ప్రహరీని కూల్చివేయడం తెలిసిందే.

వరుస వివాదాల నేపథ్యంలో ముత్తిరెడ్డికి ఈ సారి టికెట్ దక్కకపోవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. ఇదే తరుణంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ముత్తిరెడ్డికి టికెట్ ఇస్తారా..? లేదా..? పల్లానే బరిలోకి దింపుతారా..? అన్నది త్వరలోనే తేలనుంది..