ప్రజల దృష్టి మళ్లించేందుకు భావోద్వేగాలతో రాజకీయాలు : రాహుల్ గాంధీ

ప్రజల దృష్టి మళ్లించేందుకు భావోద్వేగాలతో రాజకీయాలు : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ:  భావోద్వేగ అంశాలను రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్‌‌‌‌ లీడర్ రాహుల్‌‌‌‌ గాంధీ అన్నారు. తద్వారా  దేశంలోని వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చి.. ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా రాహుల్ ఎక్స్(ట్విట్టర్) ద్వారా ప్రస్తుత రాజకీయాలను యువతకు వివరించే ప్రయత్నం చేశారు. 

‘స్వామి వివేకానంద ఆలోచనలను యువత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పేదల సేవే గొప్ప తపస్సుగా భావించారు. యువత శక్తే దేశాభివృద్ధికి ఆధారమని చెప్పారు. మన దేశానికి ప్రస్తుతం కావాల్సిందేమిటో యువతే ఆలోచించాలి?  నాణ్యమైన జీవితమా లేదా భావోద్వేగాలా? రెచ్చగొట్టే నినాదాలా లేదా ఉపాధా ? ప్రేమనా  లేదా ద్వేషమా ?. ఏది కావాలో యువతే చెప్పాలి.

 యువతకు కావాల్సింది ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వడం లేదు. పైగా భావోద్వేగాలను రాజకీయాలకు ఉపయోగించి.. నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో పేదలు విద్య, జీవనోపాధికి దూరం అవుతున్నారు. వైద్య సాయం అందక ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని సమస్యలున్నా  ప్రభుత్వం మాత్రం  దీన్ని 'అమృత్ కాల్' అని పిలుస్తున్నది. 

చక్రవర్తి(మోదీ) అధికార అహంకారంతో  గ్రౌండ్ రియాలిటీకి దూరమయ్యారు. ఈ అన్యాయపు తుఫానులో న్యాయ జ్వాల రగులుతూ ఉండేందుకే స్వామి వివేకానంద బోధనలను స్ఫూర్తిగా తీసుకోవాలి. దీనిపై నేను పోరాటం మొదలు పెట్టాను. కోట్లాది మంది యువ న్యాయ యోధాలు నాతో  చేరుతున్నారు. సత్యం, న్యాయం ఎప్పటికీ గెలుస్తూనే ఉంటాయి" అని రాహుల్ ట్వీట్ చేశారు.