ఎన్నికలు ఫ్రీగా జరుగుతున్నా.. ఫెయిర్​గా జరగడంలేదు

ఎన్నికలు ఫ్రీగా జరుగుతున్నా.. ఫెయిర్​గా జరగడంలేదు

దేశంలో ఎన్నికలు ఫ్రీగా అంటే ఎటువంటి దౌర్జన్యాలు గానీ, పోలింగుబూత్​ల ఆక్రమణలుగానీ జరగకుండా స్వేచ్ఛగా జరుగుతున్నాయి. అయితే, దేశంలో ఎన్నికలు ఫెయిర్‌‌‌‌గా అంటే ఓటర్లను డబ్బు, మద్యం ఇతర ఖరీదైన వస్తువులతో ప్రలోభపెట్టడం. అలాగే కులం, మతం ప్రాంతం, భాష వంటివి, మతపరమైన గుర్తులతో ఓటర్లను వశపరుచుకునే ప్రయత్నం చేయడం మాత్రం జరగుతున్నది. అంటే ఎన్నికలు ఫెయిర్‌‌‌‌గా జరగడం లేదు.  దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకలో డబ్బు, మద్యం పంచుతూ ఓటర్లను ప్రభావితం చేయడం పెద్ద ఎత్తున జరుగుతోంది.

నేడు రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులు శాసనసభ ఎన్నికకురూ.10 కోట్ల పైన అలాగే పార్లమెంటు ఎన్నికకు రూ. 25 కోట్ల పైన ఖర్చు చేస్తున్నారు. పరిస్థితి ఎంతవరకు దిగజారిందంటే డబ్బులు ఖర్చు చేస్తే గెలవచ్చు లేదా గెలవకపోవచ్చు కానీ డబ్బులు ఖర్చు చేయని పక్షంలో ఓడడం మాత్రం ఖాయంగా మారింది.

ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌‌‌‌ 77 ప్రకారం ఎన్నికల్లో  పోటీచేసిన అభ్యర్థి ఎన్నికల్లో చేసిన ఖర్చు వివరాలు ఓట్ల లెక్కింపు అయిన 30 రోజుల్లో జిల్లా ఎన్నికల అధికారికి ఇవ్వాలి. ఈ మధ్య నవంబర్‌‌‌‌ నెలలో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో  ఏ అభ్యర్థి 40 లక్షలకు మించకుండా ఖర్చు చేయరాదని నిబంధన విధించడం జరిగింది. ఈ నియమాన్ని అమలు చేయడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల్లో అభ్యర్థి చేయు ఖర్చుపై నిఘా పెట్టుటకు కమిషన్‌‌‌‌ అబ్జర్వర్లను నియమించింది.

ఎన్నికలు జరిగిన నెలలోపల అందరు అభ్యర్థులు తాము ఎన్నికల సందర్భంలో చేసిన ఖర్చు వివరాలు జిల్లా ఎన్నికల అధికారికి ఇవ్వడం, దానిని వెబ్‌‌‌‌సైట్​లో ఉంచడం జరిగింది. ఫోరం ఫర్‌‌‌‌ గుడ్‌‌‌‌ గవర్నెన్స్‌‌‌‌ ఆ లెక్కలన్నింటిని పరిశీలించగా అభ్యర్థుల ఖర్చు రూ. 20 లక్షల  నుంచి రూ. 35 లక్షల వరకు ఉంది. అంటే కమిషన్‌‌‌‌ పెట్టిన 40 లక్షల సీలింగు లోపల ఉంది. ఎలక్షన్‌‌‌‌ అబ్జర్వర్‌‌‌‌లు వాటిని పరిశీలించి అంతా సవ్యంగా ఉందని సర్టిఫికేట్‌‌‌‌ కూడ ఇచ్చారు. ఎన్నికల్లో ధనం, మద్యం ప్రవాహాన్ని అరికట్టడానికి ఎన్నికల కమిషన్​ రకరకాల చర్యలు తీసుకొంటుంది.

ముఖ్యంగా చెక్‌‌‌‌పోస్టులు పెట్టడం, ఫ్లయింగ్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌ లతో నిరంతరం పహరా చేయడం వంటివి జరుగుతాయి. ఈ సందర్భంలో డబ్బు, మద్యం వంటివి పట్టుబడ్డప్పుడు కేసులు కూడా రాయడం జరుగుతుంది. ఐపీసీ సెక్షన్‌‌‌‌ 171 ప్రకారం ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచడం ఇతర ప్రలోభాలు అవినీతి చర్యగా భావిస్తారు. దానికి ఒక సంవత్సరం జైలు శిక్ష కూడా ఉంది.

కేసులు అభ్యర్థులపై కాకుండా కార్యకర్తలపైనా?

2014 అసెంబ్లీ ఎన్నికల్లో సెక్షన్‌‌‌‌ 121 క్రింద 543 కేసులు నమోదై, రూ.34.38 కోట్ల డబ్బు జప్తు చేయబడింది. అలాగే 2018 ఎన్నికల్లో 548 కేసులు నమోదై రూ.50.06 కోట్ల డబ్బు జప్తు అయింది. ఇంతవరకు గత రెండు ఎన్నికల్లో నమోదైన కేసుల విచారణ పూర్తి కాలేదు. కొన్ని కేసులు కోర్టులో సరియైన ఆధారాలు లేవని కొట్టివేయడమైనది.

ఇచ్చట గమనించవలసిన విషయమేమిటంటే, ఎవరైనా కార్యకర్త డబ్బులు పంచుతూ దొరికినా, లేదా ఏదైనా వాహనాల్లో డబ్బు తరలిస్తున్నప్పుడు పట్టుకున్న సందర్భాల్లో  కేసు కార్యకర్త పైనే రాస్తున్నారు. డబ్బు ఎవరి పేరున పంచుతున్నది అనేది విచారించి అభ్యర్థులపై కేసులు నమోదు చేయడం లేదు. దానికి తోడు పోలీసుశాఖ నిర్లక్ష్యంతో కోర్టులో కేసులు వీగిపోతున్నాయి.  

డబ్బు ప్రవాహం ఆపడంలో విఫలం

ఈ మధ్యనే రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సుమారు రూ.750 కోట్లు పట్టుకున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే గుట్టు చప్పుడు కాకుండా ఈ డబ్బులో 80% వదిలిపెట్టడం జరిగింది. ఈవిధంగా ఎన్నికల కమిషన్‌‌‌‌ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంలో డబ్బు ప్రవాహం ఆపడంలో విఫలమైనదనే చెప్పాలి.  సుమారు 2 సంవత్సరాల క్రితం మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు రాజకీయపార్టీలు ఈ ఎన్నికను ఒక ప్రిస్టేజ్​గా తీసుకొని వందల కోట్లు ఖర్చు చేయడం జరిగింది.

కొన్ని సందర్భాల్లో  ప్రజలు ‘నో మనీ ..నో ఓటు’ అంటూ ప్లకార్డులు పట్టుకొని రోడ్లపై బైఠాయించారు. సాయంత్రం మూడు గంటల వరకు ఈగ్రామాల్లో ఎటువంటి పోలింగు జరగలేదు. చివరకు రాజకీయ పార్టీలు ఓటుకు ఇంత అని డబ్బు పంచడంతో 4 గంటల  ప్రాంతంలో ఓటింగు మొదలై రాత్రి 11 గంటల వరకు జరిగింది. అలాగే ఇంకో గ్రామంలో పొదుపు సంఘాల మహిళలు, పక్క  గ్రామాల్లో ఓటుకు మూడు వేలు ఇచ్చినారని మా గ్రామంలో ఓటుకు ఒక వేయి మాత్రమే ఇచ్చినారని రాస్తారోకో చేశారు. ఇంత జరిగినా అక్కడి అధికారులకు జిల్లా ఎన్నికల అధికారికి కానరాలేదు. 

ALSO READ ; ఐజీ స్టీఫెన్ రవీంద్ర..నన్ను అక్రమంగా సస్పెండ్‌ చేశారు!: సీఎంకు డీఎస్పీ గంగాధర్‌ ఫిర్యాదు

పోలీసు వాహనాల్లోనే డబ్బు రవాణా!

 

ఇన్ని చెక్‌‌‌‌పోస్టులు, ప్లయింగ్‌‌‌‌ స్క్వాడ్​లు ఉన్నా ఎవరికీ అనుమానం రాకుండా డబ్బు పోలీసు వాహనాల్లో, అంబులెన్స్‌‌‌‌ల్లో రవాణా చేస్తున్నారని వార్తలు వచ్చినాయి. పోలీసు అధికారులు అంత దిగజారుడు పనులు చేస్తారని ఎవరూ అనుకోలేదు. అయితే, గతవారం రోజుల నుంచి ఫోన్​ ట్యాపింగ్‌‌‌‌ విచారణలో అరెస్టయిన డీసీపీ రాధాకృష్ణరావు వాంగ్మూలం ప్రకారం 2023 ఎన్నికల సందర్భంలో అధికార పార్టీ ఆదేశించిన విధంగా తాను ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకు పోలీసు వాహనాల్లో డబ్బు రవాణా చేశామని ఒప్పుకోవడం.. తెలంగాణ రాష్ట్రంలో పోలీసుశాఖ పనికి అద్దం పడుతోంది. త్వరలో జరగబోయే పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో అయినా ఎన్నికల కమిషన్‌‌‌‌ పకడ్చందీ చర్యలతోఎన్నికల్లో డబ్బు, మద్యం పంచే  దుష్ట సంప్రదాయానికి అడ్డుకట్టవేయవలసిన అవసరం ఉంది.

ఎం. పద్మనాభరెడ్డి, ఫోరమ్​ ఫర్​ గుడ్​ గవర్నెన్స్​

  • Beta
Beta feature
  • Beta
Beta feature