- మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
- ఎన్నికల సామగ్రితో గ్రామాలకు చేరిన సిబ్బంది
మంచిర్యాల/ఆదిలాబాద్/నిర్మల్/ఆసిఫాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో బుధవారం తుది విడత పంచాయతీ పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం పోలింగ్‌సిబ్బంది డిస్ట్రిబ్యూషన్సెంటర్ల నుంచి పోలింగ్మెటీరియల్తీసుకొని బస్సులు, ఇతర వాహనాల్లో గ్రామాలకు వెళ్లిపోయారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పోలింగ్సెంటర్ల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ప్రారంభించి సాయంత్రంలోగా ఫలితాలను ప్రకటించనున్నారు.
మంచిర్యాల జిల్లాలో..
మూడో విడతలో చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి, జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి మండలాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 102 సర్పంచ్, 868 వార్డు స్థానాలకు గానూ 4 సర్పంచ్, 153 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 4 వార్డులకు నామినేషన్లు రాలేదు. మిగతా 98 సర్పంచ్ స్థానాలు, 711 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 1,06,889 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. 848 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని, 999 మంది పోలింగ్ ఆఫీసర్స్,1,092 మంది ఇతర సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లాలో..
మూడో విడతలో బైంసా రూరల్, కుబీర్, ముథోల్, తానూర్, బాసర మండలాల్లోని 124 సర్పంచ్, 791 వార్డు స్థానాలకు పోలింగ్‌జరగనుంది. సర్పంచ్‌గా 386 మంది, వార్డులకు 2,151మంది బరిలో నిలిచారు. మొత్తం 1,50,593 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 77,502 మంది మహిళలు, 73,085 మంది పురుషులు ఉన్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో..
మూడో విడతలో ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్ నగర్, రెబ్బెన, తిర్యాణి మండలాల్లో పోలింగ్‌జరగనుంది. మొత్తం 108 గ్రామ పంచాయతీలకు గానూ 2 ఏకగ్రీవం కాగా.. మరో రెండింటికి నామినేషన్లు రాలేదు. దీంతో మిగతా 104 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 938 వార్డులకు గానూ 186 ఏకగ్రీవమయ్యాయి.
మరో 8 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా 744 వార్డులకు పోలింగ్జరుగుతుంది. ఆసిఫాబాద్ మండలంలో 27, కాగజ్ నగర్ లో 28, రెబ్బెన 24, తిర్యాణి మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 938 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,079 మంది పీవోలు, 1,241 మంది ఏపీవోలను నియమించారు. 344 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నారు. ఈ 4 మండలాల్లో మొత్తం 1,22,249 ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 61,282 మంది, మహిళలు 61,141 మంది. 795 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
బజార్ హత్నూర్ మండలంలోని 26 జీపీలు, 244 వార్డులు, బోథ్ లో 18 జీపీలు, 182 వార్డులు, గుడిహత్నూర్‌లో 20 జీపీలు, 208 వార్డులు, నేరడిగొండలో 23 జీపీలు, 252 వార్డులు, సొనాలలో 12 జీపీలు, 96 వార్డులు, తలమడుగులో 21 జీపీలు, 238 వార్డులు.. మొత్తం 120 సర్పంచ్, 1,220 వార్డు స్థానాలకు పోలింగ్‌జరగనుంది. 1,38,908 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు.
1,009 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి,1,210 పీవోలు, 1,431 మంది ఏపీవోలను నియమించినట్లు కలెక్టర్రాజర్షిషా తెలిపారు. 938 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం తలమడుగు, గుడిహత్నూర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఆయన పరిశీలించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
