జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య
జోగిపేట, వెలుగు: ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని, పోలింగ్ విధులను సమర్థంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. జోగిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రెండో దశ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులకు జరుగుతున్న శిక్షణ తరగతులను సందర్శించారు. పోలింగ్ విధులకు సంబంధించి పలు సూచనలు చేశారు. నిబంధనలు పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని, ఏ చిన్న తప్పిదానికి తావివ్వకూడదని సూచించారు.
సమయ పాలనను పాటిస్తూ, సకాలంలో నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. పోలింగ్ మెటీరియల్ ను జాగ్రత్తగా సరిచూసుకోవాలన్నారు. చెక్ లిస్టుకు అనుగుణంగా బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రి ఉందా లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ స్టేషన్ కు చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను ముందస్తుగా చక్కబెట్టుకోవాలని కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. సీటింగ్ అరేంజ్ మెంట్, సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వంటి వాటిని నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓటింగ్ విషయంలో గోప్యత పాటించాలన్నారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో ఆర్డీవో పాండు, ప్రిసైడింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.

