ప్రతి ఒక్కరూ ఫీల్డ్‌‌‌‌కు వెళ్లాల్సిందే..పొల్యూషన్ ఫ్రీ హైదరాబాదే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి

ప్రతి ఒక్కరూ ఫీల్డ్‌‌‌‌కు వెళ్లాల్సిందే..పొల్యూషన్ ఫ్రీ హైదరాబాదే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి
  • కొత్త జోనల్ కమిషనర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం 
  •     నెలలో మూడ్రోజులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ 
  •     ప్రతి 10 రోజులకు గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ 
  •     చెరువులు, నాలాల వద్ద ఆక్రమణల తొలగింపు 
  •     హోటళ్లలో పక్కాగా ఫుడ్‌‌‌‌ సేఫ్టీ రూల్స్ అమలు చేయాలని ఆదేశం 

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్‌‌‌‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం పూర్తిస్థాయి ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌‌‌‌మెంట్ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కొత్త జోనల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ ఫీల్డ్‌‌‌‌కు వెళ్లాలని సూచించారు. ‘‘రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశాం. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) ఏరియాపై ప్రత్యేక దృష్టిసారించాం. ఇప్పటికే క్యూర్ పరిధిలోని సిటీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించాం. నగరంలో కాలుష్య నియంత్రణకు పూర్తిస్థాయి ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించాం. సిటీలో ప్లాస్టిక్‌‌‌‌ను పూర్తిగా నిషేధించాలి. 

డీజిల్ వెహికల్స్ స్థానంలో ఈవీ బస్సులు, ఆటోలు తీసుకురావాలి. హైదరాబాద్‌‌‌‌లో అత్యంత సంక్లిష్టమైన చెత్త నిర్వహణ సమస్యను అధిగమించాలి. చెరువులు, నాలాల ఆక్రమణలను తొలగించాలి. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. నెలలో మూడ్రోజులు స్పెషల్ శానిటేషన్‌‌‌‌ డ్రైవ్ నిర్వహించాలి. 

రోడ్లపై ఎక్కడా చెత్త, గుంతలు కనిపించకుండా చర్యలు తీసుకోవాలి. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతి 10 రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ చేపట్టాలి” అని సీఎం సూచించారు. ‘‘జోనల్ కమిషనర్లు ప్రతిరోజూ ఫీల్డ్‌‌‌‌లో ఉండాల్సిందే. జోన్ల వారీగా సంబంధిత సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్లదే” అని అన్నారు. వచ్చే ఐదేండ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని సూచించారు. 

గుడ్, స్మార్ట్ గవర్నెన్స్.. 

కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘‘జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధ్రువపత్రాల జారీకి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఆన్‌‌‌‌లైన్ ద్వారా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలి. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్‌‌‌‌మెంట్ అసోసియేషన్లతో కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవాలి. 

గుడ్‌‌‌‌ గవర్నెన్స్‌‌‌‌తో పాటు స్మార్ట్ గవర్నెన్స్ దిశగా చర్యలు చేపట్టాలి. హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు నాలాల పూడికతీత పనులు జనవరి నుంచి మొదలుపెట్టాలి” అని ఆదేశించారు. క్యూర్ ఏరియాలోని వివిధ విభాగాల అధికారులతో సీఎస్ సమన్వయం చేసుకుంటారని తెలిపారు. 

ఇకపై నెలకోసారి రివ్యూ..  

కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ‘‘ప్రభుత్వ కార్యాలయాలను అద్దె భవనాల నుంచి సొంత భవనాలకు తరలించాలి. కార్యాలయాల కోసం అందుబాటులో ఉన్న స్థలాలను కేటాయించి భవనాలు నిర్మించాలి. 

క్యూర్ పరిధిలోని 12 జోన్లలో చెరువులు, కుంటలు, నాలాలను పూర్తిగా మ్యాపింగ్ చేయాలి. ఆక్రమణలను తొలగించి వర్షాకాలంలో వరదలతో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. పెద్ద చెరువులను పునరుద్ధరించి, వాటిని యాక్టివిటీ జోన్స్‌‌‌‌గా అభివృద్ధి చేయాలి” అని సూచించారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే నగర భవిష్యత్ మారుతుందన్నారు. నెలకోసారి జోనల్ కమిషనర్లతో తానే స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. 

ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.