
- స్వాతి పాలిటెక్నిక్ కాలేజీ నిర్వాహకులే ఈ నేరానికి పాల్పడ్డారు
ఎల్ బీ నగర్, వెలుగు: పాలిటెక్నిక్ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాతి పాలిటెక్నిక్ కాలేజీ నిర్వాహకులు ఈ నేరానికి పాల్పడినట్లు తెలిపారు. స్టూడెంట్ల సంఖ్య తగ్గడంతో కాలేజీ పేరు ప్రఖ్యాతలు పెంచడానికి ఈ ప్లాన్ చేసినట్లు తేల్చారు. స్వాతి కాలేజీ అడ్మిన్ ఆఫీసర్ గిడ్డ కృష్ణమూర్తి(57), చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు(31), జాయింట్ సూపరింటెండెంట్ కేశెట్టి కృష్ణమోహన్(28), అబ్జర్వర్(గవర్నమెంట్ కెమిస్ట్రీ లెక్చరర్) వెంకట్రామ్రెడ్డి(47)ని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
వాట్సాప్ షేరింగ్లతో..
ఈనెల 8,9 తేదీల్లో పేపర్ లీక్ అయినట్లు టెక్నికల్ బోర్డ్ సెక్రటరీ ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పై రెండు తేదీల్లో స్వాతి కాలేజీ మేనేజ్మెంట్అరగంట ముందే వాట్సాప్‌లో క్వశ్చన్ పేపర్‌ను తమ స్టూడెంట్లకు పంపించింది. వాళ్లు ప్రశ్నాపత్రాన్ని ఇతర కాలేజీల్లో ఉండే ఫ్రెండ్స్‌కు షేర్ చేశారు. మెదక్ జిల్లా చేగుంటలోని పాలిటెక్నిక్ కాలేజీ స్టూడెంట్లు 8వ తేదీన పరీక్షకు అరగంట లేటుగా వచ్చారు.- 9న కూడా పరీక్ష హాల్లో ఎవరూ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన అబ్జర్వర్ ఎగ్జామ్ సెంటర్ ఆవరణలోని చెట్ల కింద స్టూడెంట్లు గుమిగూడి ఉండటాన్ని గమనించి, ఫోన్ పరిశీలించగా పేపర్ లీక్ అయినట్లు బయటపడింది. వెంటనే టెక్నికల్ బోర్డ్ ఆఫీసర్లకు విషయం చెప్పాడు. ప్రశ్నాపత్రంలోని కోడ్ఆధారంగా స్వాతి కాలేజీ నుంచి పేపర్ లీకైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.