కట్టలు తెగితే కాలనీలు సేఫేనా !.. గ్రేటర్​లో నిండుకుండల్లా చెరువులు

కట్టలు తెగితే కాలనీలు సేఫేనా !.. గ్రేటర్​లో నిండుకుండల్లా చెరువులు
  • ఏండ్లైనా పూర్తికాని చెరువుల అభివృద్ధి పనులు
  • వరద సాఫీగా వెళ్లేలా నిర్మించిన బాక్స్ డ్రెయిన్లలోనూ లోపాలు  
  • ప్లానింగ్ మార్పుతో  ముంపునకు గురైతున్న పలు కాలనీలు  
  • సర్కారు పట్టించుకోవట్లేదని పర్యావరణ వేత్తల ఆందోళన
  •  పలు చెరువులపై ఇప్పటికే కోర్టుల్లో కేసులు దాఖలు
  •  నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ బల్దియాకు  ఎన్జీటీ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు:  గ్రేటర్ లోని చెరువులు ఆక్రమణ చెరలో చిక్కి ప్రమాదకరంగా మారాయి. చెరువులను  అభివృద్ధి చేస్తున్నామని ఏండ్లుగా అధికారులు  చెబుతున్నారే తప్ప పూర్తి చేసినట్టు ఎక్కడా కనిపించడంలేదు. వానలు పడ్డప్పుడు వరదలతో చెరువుల కట్టలు తెగుతున్న పరిస్థితి ఉంది. ఇలా 2020లో  పలు చెరువుల కట్టలు తెగి కాలనీలు, బస్తీలను ముంచెత్తాయి. నెల రోజుల కిందట కురిసిన భారీ వర్షానికి 35 చెరువులు నిండుకుండల్లా మారాయి. ఇందులో మూడు, నాలుగు చెరువులు డేంజర్ గా ఉన్నాయి.

కొన్నింటిని బల్దియా కమిషనర్ పరిశీలించి  వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను  ఆదేశించారు. ఇటీవల కురిసిన వానలకు మళ్లీ చెరువులు నిండాయి. లింగంపల్లిలోని చాకల్ వాని చెరువు, గోపిచెరువు, ఆర్సీపురం రాయసముద్రం, బండ్లగూడ చెరువు, నాగోల్ చెరువు, హయత్ నగర్ లోని బాతుల చెరువు, కుమ్మరి కుంట, మన్సురాబాద్ పెద్ద చెరువు, కుత్బుల్లాపూర్ లోని ఫాక్స్ సాగర్, గాజుల రామారం పరిధిలోని చెరువుల్లో సగానికిపైగా పొంగిపొర్లాయి. ఇందుకు ప్రధాన కారణం.. చెరువులు కబ్జాల పాలవడంతో వరద నీరంతా ముంపు ప్రాంతాలను చుట్టేస్తుంది.  సిటీలోని దాదాపు అన్ని చెరువులపైనా కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి.

 189 చెరువులపై ఆక్రమణలు, పొల్యూషన్, వరదనీరు పోయే వీలులేక కాలనీలు మునుగుతున్నాయని..  ఇలా ఏదో ఒక సమస్యపై పర్యావరణవేత్తలతో పాటు స్థానికులు కోర్టులను ఆశ్రయించారు.  ఇటీవల లింగంపల్లిలోని చాకల్ వాని చెరువు, గోపిచెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో వరద నీరు పోయే వీలులేక లింగంపల్లి రైల్వే అండర్ పాస్ లోకి వచ్చి చేరింది. దీంతో  వానలు పడిన ప్రతిసారి రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోతుండగా.. లక్షలాది మంది ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీహెచ్ఈఎల్ ఎంఐజీకాలనీలోని హ్యుమన్ రైట్స్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్, గజ్జల యోగానంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై  విచారణ జరిపిన ఎన్జీటీ నాలుగువారాల్లోగా నివేదిక ఇవ్వాలని  జీహెచ్ఎంసీ కమిషనర్ ని ఆదేశించింది. 

బాక్స్ డ్రెయిన్ల నిర్మాణంతో కూడా..

 చెరువుల్లోకి వరదనీరు సాఫీగా వెళ్లేందుకు గతంలోని కాల్వల స్థానంలో నాలాల అభివృద్ధి పేరుతో బాక్స్ డ్రెయిన్లను జీహెచ్ఎంసీ నిర్మిస్తుంది. వెంచర్లు, అపార్టుమెంట్లకు అనుకూలంగా బాక్స్  డ్రెయిన్లను నిర్మిస్తుండగా వరదనీరు సాఫీగా పోవడంలేదు. దీంతో కాలనీలు నీటమునుగుతున్న పరిస్థితి ఉంది. బాక్స్ డ్రెయిన్ల నిర్మాణ ప్లానింగ్ మార్పులతోనే ముంపునకు కారణంగా ఉంది. నాగోల్ లో నిర్మించిన బాక్స్ డ్రెయిన్లు పలు మూలమలుపులతో నిర్మించారు. ఇంకొన్ని ప్రాంతాల్లో బాక్స్ డ్రెయిన్ లైన్లలో సీవరేజీ లైన్లు కూడా కలిశాయి. దీనిపై ఇటీవల జరిగిన కౌన్సిల్ మీటింగ్ లో లింగోజీగూడ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి, చంపాపేట్ కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి బల్దియా, వాటర్ బోర్డు అధికారులను ప్రశ్నించగా వారు సరైన జవాబు ఇవ్వలేదు. లింగంపల్లి రై‌‌‌‌ల్వే బ్రిడ్జి కింద కూడా వరదనీటిని తొలగించేందుకు బాక్స్ డ్రెయిన్ నిర్మించేందుకు ప్లాన్ చేసింది. నిర్మిస్తే.. చెరువులను ఆక్రమించిన వారికే మేలు జరుగుతుందని పలువురు కోర్టును ఈఆశ్రయించగా పనులకు తాత్కాలిక బ్రేక్ వేసింది. 

 రెండు ఫీట్లు మెయింటెన్ చేయట్లే..

 చెరువుల్లో ఫుల్ ట్యాంక్ లెవల్ కు రెండు ఫీట్ల మేర మెయింటెన్ చేస్తామని అధికారులు నిర్ణయించారు. అయినా ఆ విధంగా చేయడంలేదు. ప్రతి చెరువు వద్ద మోటర్లు పెట్టి నిత్యం నీటి లెవల్ ను  పరిశీలించాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదు. దీంతో వానలు పడ్డప్పుడు ఇబ్బందులు తలెత్తున్నాయి. వర్షాల సమయంలో చెరువులపై  మాట్లాడుతున్నారే తప్ప ఆ తర్వాత ఎవరూ మాట్లాడటంలేదు.  సిటీలో దాదాపు అన్నీ చెరువుల్లో కనీసం రెండు ఫీట్ల లెవల్ మెయింటెన్ చేస్తే ఇబ్బందులైనా తప్పనున్నాయి.    

ఎఫ్ టీఎల్ గుర్తింపు ఆలస్యంతోనే..  

 మొత్తం 157 చెరువులకు నోటిఫికేషన్ వేయగా ఇందులో 52  ఫైనల్​చేశారు. మిగతా105 చెరువులపై అభ్యంతరాలు వచ్చాయి. దీంతో వాటి  ఎఫ్ టీఎల్​ఫైనల్​ప్రక్రియ నడుస్తుంది. తమవే భూములంటూ కొందరి నుంచి అభ్యతంరాలు వస్తుండగా, కొన్నిచోట్ల  ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసినవి కూడా ఉండగా.. వీరి నుంచి ఆబ్జెక్షన్స్ వస్తున్నాయి.  ఆ చెరువులపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. 2020 అక్టోబర్ లో వచ్చిన వరదలతో  సిటీలోని ప్రాంతాలు తీవ్ర ముంపునకు గురయ్యాయి. 500 లకుపైగా కాలనీలు రోజుల పాటు వరదనీటిలో చిక్కాయి. లోతట్టు ప్రాంతాల జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టోలిచౌక్ నదీంకాలనీ, చాంద్రాయణగుట్ట ఆల్ జుబైర్ కాలనీలతో పాటు పలు ప్రాంతాల్లో 10 ఫీట్లలోతు వరదనీరు నిలిచి ఉండగా స్థానికులు అవస్థలు పడ్డారు. 

రూ.500 కోట్లకుపైగా ఖర్చు 

చెరువుల చుట్టు ఫెన్సింగ్ ఏర్పాటు, మురుగు నీటి మళ్లింపు, వాకింగ్ ట్రాక్,  లైటింగ్ ఇతర సౌలతులు కల్పించేందుకు బల్దియా  ఇప్పటికే రూ.500 కోట్లకుపైగా ఖర్చు చేసింది. రెండేళ్ల కిందట ఎమర్జెన్సీగా చేసే మరమ్మతులకు రూ.9.42 కోట్లు, మరో రూ.94.17 కోట్లతో 63 చెరువుల వద్ద వివిధ పనులు చేపట్టింది. ఇంకో .. రూ.282 కోట్లతో మిషన్ కాకతీయ నిధుల నుంచి 19 చెరువుల పనులు చేపట్టారు. రూ.95.54 కోట్లతో మరో 61 చెరువులకు వెళ్లే రోడ్లను బాగు చేసేందుకు బల్దియా ఖర్చు చేస్తుందని చెప్పింది. కానీ ఎంత మేరా పనులు చేశారనేదానిపై క్లారిటీ లేదు. ఈ ఏడాది చెరువుల రక్షణ, పునరుద్ధరణకు రూ.345 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటి పైనా స్పష్టతలేదు. ఇలా వందల కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా పరిస్థితిలో మార్పులేదు. మెయిన్ రోడ్లపై ఉన్న ఒకటి, రెండు మినహా ఏ చెరువు వద్ద కు  వెళ్లి చూసినా సరిగా సదుపాయాలు కనిపించడంలేదు. తమ ప్రాంతంలోని చెరువులను పరిరక్షించాలంటూ బల్దియాకు స్థానికుల నుంచి రెగ్యులర్ గా ఫిర్యాదులు అందుతున్నాయి.

ఎన్జీటీ ఆదేశాలతోనైనా.. 

గోపి చెరువు, చాకల్ వాని చెరువులు కబ్జాల పాలవడంతో చెరువుల్లో చేరాల్సిన వరద రోడ్లపైకి చేరుతుంది. దీంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు లింగంపల్లి రైల్వే అండర్ పాస్ నే ఉదాహరణ. దీనిపై ఎన్జీటీని ఆశ్రయించాం. జీహెచ్ఎంసీను నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. ఇకనైనా అధికారులు చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి.

ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్, పిటిషనర్

ప్రభుత్వం పట్టించుకోవాలి

చెరువులు, జలాశయాల  పరిరక్షణను తెలంగాణ ప్రభుత్వం అసలు పట్టించుకుంటున్నట్లు కనిపించడంలేదు. చెరువులు ఆక్రమణలు అవుతుండగా.. ఇప్పటికే గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. భవిష్యత్ తరాల కోసం భూగర్భజలాలను కాపాల్సిన బాధ్యత ఎంతో ఉంది. కొన్నింటిపై కోర్టులు ఆదేశాలు ఇస్తున్నా కూడా  రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవడంలేదు.  కోర్టులను తప్పదోవ పట్టిస్తుంది.  

దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త

30 చెరువులపై కేసులు వేసిన.. 

 ఆక్రమణలు అయ్యాయని  సిటీలోని 30 చెరువులపై ఎన్జీటీ, హైకోర్టు, హెచ్​ఆర్ సీ , లోకాయుక్తలో కేసులు నడుస్తున్నాయి. శివారులోని జంట జలాశయాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని అన్ని ఆధారాలతో పిటిషన్ వేశాను. హెచ్ఎండీఏ నోటిఫై చేసిన చెరువుల్లోనూ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలా అన్ని చెరువులు ఆక్రమణలకు గురైతే భవిష్యత్ తరాలకు ఇక్కడ చెరువులు ఉండేవని చెప్పుకోవడానికే ఉంటాయి. చెరువుల కబ్జాలతోనే వానలు పడ్డప్పుడు వరదలతో కాలనీలు మునుగుతున్నాయి.

వెంగళరావు పార్కులోని చెరువు ఒకప్పుడు చాలా పెద్దది. రాజ్ భవన్ రోడ్డు, పంజాగుట్టల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడానికి ఇదే కారణం. ఇలా అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. దీనిపై న్యాయస్థానం తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వాన్ని ఆదేశించి చర్యలు తీసుకునేలా చూడాలి.  చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. 

డాక్టర్ లుబ్నా సర్వత్, ఫౌండర్ -డైరెక్టర్, సెంటర్ ఫర్ వెల్‌‌బీయింగ్ ఎకనామిక్స్ హైదరాబాద్