ఇంటి నిర్మాణంలో విఘ్నాలా? పెళ్లి కుదరడం లేదా?.. అయితే వెంటనే ఈ బొడ్డ గణేశుడిని దర్శించుకోండి

 ఇంటి నిర్మాణంలో విఘ్నాలా? పెళ్లి కుదరడం లేదా?.. అయితే వెంటనే ఈ  బొడ్డ గణేశుడిని దర్శించుకోండి

వినాయకుని విశిష్ట ఆలయాలలో కేరళ కాసరగోడ్  జిల్లా మద్దూర్ లోని మధురంతేశ్వర సిద్ధి వినాయక ఆలయం ఒకటి. మధుర వాహిని నదీతీరంలో ప్రకృతి రమణీయత మధ్య కొలువు దీరిన ఈ గణపతి దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు బారులు తీరుతారు. మధురంతేశ్వర సిద్ది వినాయకుని ఒకసారి దర్శించుకుంటే చేపట్టిన ఇంటి నిర్మాణ పనుల్లో విఘ్నాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే వివాహం ఆలస్యం అవుతున్నా మద్దూరు గణపతిని దర్శించుకుంటే విఘ్నాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ ఆలయంలో గణపతి రోజురోజుకు పెరుగుతాడని అంటారు. ఒకానొక సమయంలో ఆలయంలోని గర్భగుడి దక్షిణ గోడపై ఒక బాలుడు గణపతి చిత్రాన్ని గీశాడు. రోజురోజుకూ ఆ చిత్రం పెరుగుతూ ఉండడం వల్ల ఈ గణపతిని "బొడ్డజ్ఞ" లేదా "బొడ్డ గణేశుడు" అని వ్యవహరిస్తారు

ఆలయ స్థల పురాణం

ఒక్క నొక్కప్పుడు మధురవాహిని నదీతీరంలో మధురు అనే మహిళ నీటి కోసం వెళ్లినప్పుడు గణపతి ఆమె ఎదుట సాక్షాత్కరించి అక్కడే విగ్రహంగా మారిపోతాడు. వెంటనే ఆ మహిళ ఆ విషయాన్ని గ్రామస్థులకు తెలియజేసి వారి సహాయంతో స్వామి మూర్తిని నది ఒడ్డునే ఉన్న శివాలయం లోకి చేర్చి అక్కడే ప్రతిష్ఠింపజేస్తుంది. గణపతి మధురుకు దర్శనమిచ్చి ఆమె సహాయంతోనే అక్కడ వెలసిన కారణంగా ఆమె పేరు మీద ఈ ఆలయం మద్దూరు ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

►ALSO READ | వినాయకుడి జన్మస్థలం ఇదే.!

మనసు మార్చుకున్న టిప్పు సుల్తాన్

ఒకసారి టిప్పు సుల్తాన్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని దండెత్తి వస్తాడు. ఆ సమయంలో టిప్పు సుల్తాన్కు దాహం వేసి ఆలయ ప్రాంగణంలోని బావి నీళ్లను తాగుతాడు. గణపతి మహాత్యంతో బావి నీళ్లను తాగిన తర్వాత టిప్పు సుల్తాన్ మనసు మార్చుకొని దాడిని విరమించుకొని స్వామిని భక్తితో కొలిచి అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడి మహాగణపతికి కేరళ సాంప్రదాయ వంటకమైన అప్పాన్నే నైవేద్యంగా పెడతారు. అదే భక్తులకు ప్రసాదంగా పంచి పెడతారు. గణపతికి విశేషంగా జరిగే సహస్ర అప్ప పూజలో భాగంగా నెయ్యి అప్పాలతో ప్రతిరోజు పూజలు జరిపించడం విశేషం. అలాగే మూడ అప్పం పేరుతో మరో పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది. అందులో భాగంగా స్వామి వారికి ఏ అలంకారం లేకుండా విగ్రహాన్ని అప్పాలతో కప్పేసి పూజాదికాలు నిర్వహిస్తారు