
- ఫొటోతో కూడిన వార్త పరిపూర్ణం: కె. శ్రీనివాస్ రెడ్డి
- ఫొటో జర్నలిస్టులకు అవార్డులు అందజేత
- అవార్డు అందుకున్న వెలుగు ఫొటోగ్రాఫర్ భాస్కర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఫొటో జర్నలిస్టులు అంకితభావంతో, సృజనాత్మకంగా తీసిన మంచి ఫొటోలు పాఠకులను ఆలోచింపజేస్తాయని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంచి ఫోటోలు వార్తలను అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తాయన్నారు. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సోమవారం బేగంపేటలోని ఓ హోటల్ లో సమాచార శాఖ ఆధ్వర్యంలో అవార్డు ప్రదాన వేడుకలు ఘనంగా జరిగాయి.
అభయహస్తం హామీలపై నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలకు వచ్చిన ఫోటో ఎంట్రీలను కార్యక్రమంలో ప్రదర్శించారు. 5 కేటగిరీలలో జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన ఫోటోలను తీసిన ఫోటోగ్రాఫర్లకు మెమెంటో, శాలువా, నగదు పురస్కారాలను మంత్రి పొంగులేటి, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు అందజేశారు. పోటీలో ఉత్తమ ఫొటోగ్రాఫర్ గా ఎంపికైన సిద్దిపేట జిల్లా వీ6 వెలుగు ఫొటోగ్రాఫర్ మహిమల భాస్కర్ రెడ్డి మెమెంటోతోపాటు రూ. 20 వేల నగదు బహుమతిని అందుకున్నారు.
రైతు భరోసా(కేటగిరీ 2) విభాగంలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. తనకు రోజూ దిపత్రికలు చదివే అలవాటు ఉందని, కొన్ని పేజీల్లో ఫొటోలను చూసి ఆ వార్తల్లోని అంశాన్ని అర్థం చేసుకుంటానని చెప్పారు. ఫొటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.
శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఫొటోతో కూడిన వార్తకు పరిపూర్ణత చేకూరుతుందన్నారు. ఫొటోగ్రాఫర్లు క్షేత్ర స్థాయిలో అనేక ఇబ్బందులను భరించి పనిచేస్తారని కొనియాడారు. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే పోటీలకు 5 కేటగిరీల్లో 101 మంది 990 ఫోటోలను పంపినట్లు కమిషనర్ హనుమంతరావు వెల్లడించారు. ఫోటోగ్రఫీ, జర్నలిజంలో నిష్ణాతులైన న్యాయ నిర్ణేతలు ప్రతి కేటగిరీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు, 5 కన్సోలేషన్ ప్రైజ్ లకు ఫోటోలను ఎంపిక చేసినట్లు తెలిపారు.