తెలంగాణలో కొత్త పార్టీ..రహస్యంగా మొదలైన కార్యాచరణ

 తెలంగాణలో కొత్త పార్టీ..రహస్యంగా మొదలైన కార్యాచరణ

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. గత కొంత కాలంగా తటస్థంగా ఉంటున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేంద్రంగా కొత్త పార్టీకి అంకురార్పణ జరగనున్నట్టు తెలిసింది. పొంగులేటి బీఆర్ఎస్ ను వీడిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చినా ఎందులోనూ చేరలేదు. బీజేపీ నేతలు పలు మార్లు చర్చలు జరిపినా ఫలవంతం కాలేదు. తామే ఓ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది..? అనే అంశంపై పొంగులేటి తెలంగాణ వ్యాప్తంగా సర్వేలు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. తమ వెంట ఎవరు వస్తారు..? ఎవరు చేరితే లాభం చేకూరుతుంది? అనే అంశాలపైనా పొంగులేటి చర్చిస్తున్నారని సమాచారం. ఇందు కోసం ప్రజాబలం కలిగి, వివిధ పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలతో పొంగులేటి టచ్ లోకి వెళ్లినట్టు తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు కనీసం 20 నుంచి 25 సీట్లను గెలుచుకోవడం ద్వారా రాష్ట్ర రాజకీయాలను శాసించ వచ్చనేది పొంగులేటి వ్యూహంగా కనిపిస్తోంది. 

 
కలిసి రానున్న కాంగ్రెస్ అసంతృప్తులు

కర్నాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి క్రేజ్ పెరిగింది. అయితే ఆ పార్టీలో చేరేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. అక్కడి గ్రూపు రాజకీయాల కారణంగా ఇబ్బంది పడుతున్న సీనియర్లు కొత్తగా ఏర్పాటు కాబోయే పార్టీ వైపు చూస్తున్నారు. వారితో పొంగులేటి చర్చలు జరిపినట్టు సమాచారం. ఇప్పటి వరకు కేవలం ఖమ్మం జిల్లా పాలిటిక్స్ కే పరిమితమైన పొంగులేటి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తమతో కలిసొచ్చే వారి కోసం ఆరా తీస్తున్నారని తెలిసింది. 

 
వెంట నడిచేదెవరు..!

రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ వాక్యూమ్ తో ఓ పార్టీకి అవకాశం ఉంది. తెలంగాణ అస్తిత్వం.. ఉద్యమ సమయంలోని ట్యాగ్ లైన్స్ గా ఉన్న నీళ్లు, నిధులు, నియామకాల కల సాకారం కాలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని పేర్కొంటూ కొత్త పార్టీ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. పార్టీ ఏర్పాటు, నడపడం డబ్బులతో కూడుకొన్న పని కావడం.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పార్టీ నడిపే సత్తా ఉండటంతో మిగతా నాయకులు ఆయన వైపు చూస్తున్నారని సమాచారం.