- ప్రజలకు అత్యుత్తమ సేవలే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి
- గత పాలకులు రెవెన్యూ వ్యవస్థను భ్రష్టుపట్టించారని ఫైర్
- నేడు పఠాన్‌చెరువులో భవన నిర్మాణానికి శంకుస్థాపన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అప్పటి పాలకుల స్వార్థపూరిత నిర్ణయాల వల్ల రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిందన్నారు. గత రెండేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఆ వ్యవస్థను సంస్కరిస్తూ, సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నామన్నారు. మంగళవారం సచివాలయంలో ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల ఏర్పాటుపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
అనంతరం పఠాన్‌చెరువులో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ భవనానికి బుధవారం శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వంపై ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం పడకుండా కార్పొరేట్ స్థాయిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 క్లస్టర్లుగా విభజించి, ప్రైవేటు నిర్మాణ సంస్థల సహకారంతో వీటిని నిర్మిస్తున్నామన్నారు.
నిర్మాణంతో పాటు ఐదేళ్ల నిర్వహణ బాధ్యతను కూడా ఆ సంస్థలే చూసుకుంటాయని వివరించారు. 3 నుంచి 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ కార్యాలయాల్లో వివాహ రిజిస్ట్రేషన్ల కోసం మినీ మ్యారేజీ హాల్, గర్భిణులు, వృద్ధులకు ప్రత్యేక వసతులు, విశాలమైన వెయిటింగ్ హాల్, తల్లుల కోసం ఫీడింగ్ రూమ్, పిల్లల కోసం క్రెచ్, దివ్యాంగుల కోసం ఆధునిక లిఫ్ట్ సౌకర్యాలు ఉంటాయన్నారు.
జూన్ 2 నాటికి అందుబాటులోకి..
మొదటి దశలో ఓఆర్‌ఆర్ పరిధిలో చేపట్టిన పనుల్లో ఇప్పటికే తాలిమ్‌లో ఇంటిగ్రేటెడ్ భవన పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, జూన్ 2 నాటికి దీన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇటీవల మేడ్చల్ జిల్లాలోనూ శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. బుధవారం పఠాన్‌చెరు -శంకరపల్లి ప్రధాన రహదారి సమీపంలో రాజపుష్ప కన్‌స్ట్రక్షన్ సంస్థ నిర్మించే ఇంటిగ్రేటెడ్ భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.
