నిషేధిత భూములకు ప్రత్యేక పోర్టల్ : పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

నిషేధిత భూములకు ప్రత్యేక పోర్టల్ : పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: నిషేధిత జాబితాలోని ఆస్తులను సబ్- రిజిస్ట్రార్  కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్  చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది.  ఇందుకోసం ‘భూ భారతి’ తరహాలో ఒక ప్రత్యేక పోర్టల్‌‌ను ఏర్పాటు చేసింది. అందులో నిషేధిత ఆస్తుల వివరాలు పొందుపరుస్తారు. ఒకవేళ నిషేధిత భూమిని ఎక్కడైనా రిజిస్ట్రేషన్  చేస్తే, వెంటనే హైదరాబాద్‌‌లోని స్టాంప్స్  అండ్​ రిజిస్ట్రేషన్  ప్రధాన కార్యాలయానికి ఆన్‌‌లైన్‌‌లో సమాచారం చేరేలా వ్యవస్థను రూపొందించారు. నిషేధిత భూములను రిజిస్ట్రేషన్  చేసే అధికారులపై కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు.

రాష్ట్రంలోని అన్ని సబ్- రిజిస్ట్రార్  కార్యాలయాల్లో జూన్ 2 నుంచి స్లాట్ బుకింగ్  విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్తుల కొనుగోలు, విక్రయదారులు పారదర్శకంగా, అవినీతిరహితంగా, సమయం ఆదా చేసుకుంటూ మెరుగైన సేవలు పొందేలా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.  ఇప్పటికే రెండు దశల్లో 47 సబ్- రిజిస్ట్రార్  కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్  విధానం విజయవంతంగా అమలవుతోందన్నారు. ఏప్రిల్ 10న 22 కార్యాలయాల్లో ప్రారంభమైన ఈ విధానం, మే 12 నుంచి మరో 25 కార్యాలయాలకు విస్తరించామని, ఆ 47 చోట్ల దాదాపు 36 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని, 94 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి వెల్లడించారు.