లక్షమంది కార్యకర్తలతో సీఎం సభ: పొంగులేటి శ్రీనివాసరెడ్డి

లక్షమంది కార్యకర్తలతో సీఎం సభ: పొంగులేటి శ్రీనివాసరెడ్డి

చండ్రుగొండ, వెలుగు :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్న సభకు లక్షమంది కార్యకర్తలను తరలించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. చండ్రుగొండ మండలంలో మంగళవారం ఆయన పర్యటించి సీఎం పర్యటన ఏర్పాట్ల ను పర్యవేక్షించారు. బెండాలపాడులో సీఎం ప్రారంభించనున్న ఇండ్లు, దామరచర్ల గ్రామంలో  సభాప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇండ్లు మంజూరు చేయగా 2.90 లక్షల ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. 

ఇండ్ల నిర్మాణం లో అవకతవకలు జరిగితే సంబంధిత ఆఫీసర్ల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయలబ్ధి కోసం కాకుండా పార్టీకు అతీతంగా అర్హులైన పేదలకు ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం ఇదే జిల్లాలో ప్రారంభం చేయడం హర్షనీయమన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, రాష్ట్ర ఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు, హౌసింగ్ ఎండీ గౌతమ్, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహూల్, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, ఎస్పీ రోహిత్ రాజు, హౌసింగ్ పీడీ రవీంద్రనాధ్, తదితరులు ఉన్నారు.