బీసీ సంఘాలు మాపై కాదు..బీజేపీ, బీఆర్ఎస్పై పోరాడాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీ సంఘాలు మాపై కాదు..బీజేపీ, బీఆర్ఎస్పై పోరాడాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

 

  • ఆ రెండు పార్టీలే బీసీ రిజర్వేషన్  బిల్లును ఆపుతున్నయ్: మంత్రి పొన్నం 
  • 42% రిజర్వేషన్ల బిల్లునుతొక్కిపెట్టింది కేంద్రమే
  • హిందువుల కోసమైనా బండి సంజయ్​ బిల్లు పాస్​ చేయించాలి
  • సామాజిక న్యాయంలో కాంగ్రెస్సే చాంపియన్​
  • బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సీట్లు తగ్గాయని ఆయా సంఘాలు తమ ప్రభుత్వం మీద పోరాటం చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు పాస్ కాకుండా కేంద్రం వద్ద ఆపుతున్న బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పైనే పోరాటం చేయాలని కోరారు. గురువారం గాంధీభవన్​లో మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

రాజ్యాంగం ప్రకారమే రిజర్వేషన్లను కేటాయించారని, బీసీలకు తక్కువ సీట్లు వచ్చాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ‘‘బీసీల 42 శాతం రిజర్వేషన్ల బిల్లు మీ కేంద్ర ప్రభుత్వం దగ్గరే పెండింగ్​లో ఉంది. దాన్ని మీరు పాస్ చేయిస్తే వంద శాతం హిందువులకు న్యాయం జరుగుతుంది” అని కేంద్ర మంత్రి బండి సంజయ్​కి సూచించారు. 

ఈడబ్ల్యూఎస్ బిల్లును ఆగమేఘాల మీద పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన బీజేపీ.. బీసీ బిల్లును మాత్రం ఎందుకు అడ్డుకుంటుందో ఆ పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.‘‘మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, నీకు భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. కేసీఆర్ చెప్పాడని కిషన్ రెడ్డి.. నీ నోరును మెదపనియ్యడం లేదేమో.. కానీ, 42 శాతం ఉన్నదంతా హిందువులే. గుళ్లకుపోయేది వీళ్లే. 

అందుకే హిందువుల కోసమైనా ఆ బిల్లు పాస్ చేయించండి” అని బండి సంజయ్​ని పొన్నం కోరారు. రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనైనా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు కాంగ్రెస్ చేస్తున్న పోరాటంలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రావాలని పిలుపునిచ్చారు.  

సామాజిక న్యాయంలో కాంగ్రెసే చాంపియన్ 

పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయం ఎలా ఉన్నా.. సర్పంచులుగా బీసీ అభ్యర్థులనే గెలిపించాలని ప్రజలకు మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. కొందరు కావాలని బీసీలకు తక్కువ సీట్లు వచ్చాయని తప్పుడు లెక్కలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీల మీద బీజేపీ, బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా తాము తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. 

దీనిపై కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో ఇంప్లీడ్ కావాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలను కోరినా స్పందించలేదన్నారు. రెండేండ్ల నుంచి పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. 2,800 కోట్ల నిధులు ఆగిపోతాయనే తమ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తోందన్నారు. బీజేపీ బీసీ సీఎం అని ప్రకటించిందని, కానీ ఆ పార్టీ అధ్యక్షుడిని, బీజేఎల్పీ లీడర్ ను మాత్రం బీసీని చేయలేకపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ లో అన్ని పదవులు ఆ సామాజిక వర్గం వారికేనని, బీసీ బిల్లుకు సహకరించని ఆ పార్టీకి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 

కాంగ్రెస్​లో ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కో కీలక పదవి ఉందని, సామాజిక న్యాయానికి తమ పార్టీ మారుపేరుగా నిలిచిందని చెప్పారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సామాజిక వర్గాల చాంపియన్ కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. తాము బీసీ బిల్లు పెడితే ఎమ్మెల్సీ కవిత సంబరాలు చేసుకున్నారని, ఇప్పుడు తమను ఆమె తిట్టడం ఏంటని ప్రశ్నించారు.  

తెలంగాణ రైజింగ్ 2047లో ముందుకెళ్తున్నం

తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో ముందుకెళ్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందులో భాగంగా 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల జీడీపీని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల జీడీపీని సాధిస్తామని చెప్పారు. గురువారం రాజ్ భవన్‌‌లో జరిగిన తెలంగాణ- నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఎ టెక్నో- కల్చరల్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఫెస్టివల్‌‌లో కీలక పాత్ర పోషించిన పలువురు అధికారులకు గవర్నర్, మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు. 

పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య శాశ్వత సంబంధాలకు ఈ ఫెస్టివల్ రోడ్ మ్యాప్‌‌లాగా ఉపయోగపడిందన్నారు. ఫార్మా, బయో టెక్నాలజీ, ఐటీ రంగాల్లో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఈశాన్య రాష్ట్రాలకు ల్యాండ్ కేటాయిస్తామని సీఎం ప్రకటించినట్లు మంత్రి గుర్తుచేశారు. రెండు దశల్లో జరిగిన ఈ ఫెస్టివల్‌‌లో మొత్తం 17 ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.