హుస్నాబాద్​లో కాంగ్రెస్​ పోటీ చేస్తది: పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్​లో కాంగ్రెస్​ పోటీ చేస్తది: పొన్నం ప్రభాకర్​

కోహెడ, వెలుగు : హుస్నాబాద్​లో కాంగ్రెస్​ పోటీ చేస్తోందని, కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ స్పష్టం చేశారు. బుధవారం మండలంలోని నకిరేకొమ్ములలో ‘పల్లె పల్లెకు ప్రవీణ్​ అన్న.. గడప గడపకు కాంగ్రెస్’​ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్​ రెడ్డితో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ద దొర లెక్క కాళ్లు మొక్కించుకునేందుకే పరిమితమైతున్నరు 

తప్ప పేద ప్రజల సమస్యలను తీర్చడం లేదన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు తమ హయాంలోనే 70 శాతం కంప్లీట్​ చేశామని, పదేళ్లల్లో ప్రాజెక్టు పనులను పూర్తి చేయని అసమర్థుడు ప్రస్తుత ఎమ్మెల్యే అని దుయ్యబట్టారు. శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం జర్మనీ   నుంచి నిధులు తెస్తున్నమని చెప్పి విస్మరించారన్నారు. సిద్దిపేట కోమటి చెరువు కంటే ఎక్కువగా అభివృద్ధికి స్కోప్​ ఉండే ఈ ప్రాజెక్టును టూరిజం స్పాట్​గా అబివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 

నియోజక అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, అధికార పార్టీ లీడర్లు సిద్ధమా అని సవాల్ ​విసిరారు. అనంతరం వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్​లో చేరారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు  కేడం లింగమూర్తి, బస్వరాజు శంకర్, సింగిల్​విండో చైర్మన్​బొలిశెట్టి శివ్వయ్య, మాజీ సర్పంచులు శెట్టి సుధాకర్, భీంరెడ్డి మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, ధర్మయ్య, కిషన్, రాజ్​కుమార్, శ్రీనివాస్​ ఉన్నారు.