హుస్నాబాద్, వెలుగు : వచ్చే శివరాత్రి నాటికి గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి కాల్వల ద్వారా రైతుల పొలాలకు నీళ్లు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. శివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మరకత లింగేశ్వరుడిని, పొట్లపల్లిలో స్వయంభు రాజేశ్వరస్వామిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ కల నెరవేరడానికి శివుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
గోదావరి జలాలతో హుస్నాబాద్‌ను సస్యశ్యామలం చేయాలన్నదే తన సంకల్పమని చెప్పారు. నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని శివయ్యను వేడుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, గడపగడపకు చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
